ఇక భూ రికార్డులు మార్చలేరు

ఇక భూ రికార్డులు మార్చలేరు

    భూముల రిజిస్ట్రేషన్లలో బ్లాక్‌‌ చైన్‌‌ టెక్నాలజీ

    డబుల్ రిజిస్ట్రేషన్లు, రికార్డుల టాంపరింగ్‌‌కు చెక్‌‌

    ఇప్పటికే టీచిట్స్‌‌లో ఈ టెక్నాలజీ వాడకం

డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు, రికార్డుల టాంపరింగ్‌‌కు చెక్‌‌ పెట్టేందుకు డేటా నిర్వహణలో బ్లాక్‌‌ చైన్‌‌ టెక్నాలజీ వాడాలని స్టాంప్స్‌‌ అండ్‌‌ రిజిస్ట్రేషన్ల శాఖ  భావిస్తోంది. చిట్‌‌ఫండ్‌‌ బిజినెస్‌‌లో మోసాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన టీచిట్స్‌‌ వెబ్‌‌సైట్‌‌లో ఇప్పటికే బ్లాక్‌‌ చైన్‌‌ టెక్నాలజీ వాడుతున్నారు.  దీంతో పలు చిట్‌‌ఫండ్‌‌ కంపెనీలు నిబంధనలను అతిక్రమిస్తూ చీటిపాడిన సభ్యులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, కిస్తీలు జమ చేయకపోవడం, రికార్డులు ట్యాంపరింగ్‌‌ చేయడంలాంటి మోసాలకు చెక్‌‌పడింది. ఈ టెక్నాలజీ సత్ఫలితాలివ్వడంతో భూరికార్డుల నిర్వహణలో బ్లాక్‌‌ చైన్‌‌ టెక్నాలజీని వినియోగించాలని రిజిస్ట్రేషన్‌‌ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర స్టాంప్స్‌‌, రిజిస్ట్రేషన్‌‌ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సెంటర్‌‌ ఫర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ అడ్వాన్స్‌‌డ్‌‌ కంప్యూటింగ్‌‌(సీ డాట్స్‌‌)  సహకారం తీసుకుంటున్నట్లు తెలిసింది.

డేటా ట్యాంపరింగ్‌‌కు నో చాన్స్‌‌

బ్లాక్‌‌ చైన్‌‌ టెక్నాలజీ అమలులోకి వస్తే రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు, మోసాలకు ఆస్కారం ఉండదు. బ్లాక్‌‌చైన్‌‌ టెక్నాలజీలో ఒకసారి డేటా ఎంట్రీ అయిన తర్వాత ఆన్‌‌లైన్‌‌లో పూర్తి సమాచారం కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్‌‌ విధానంలో సమాచారం ఇష్టారీతిన మార్చడానికి కుదరదు. దీనివల్ల వాస్తవ సమాచారాన్ని ట్యాంపర్‌‌ చేయడానికి లేదా దొంగచాటుగా మార్చడానికి వీలుండదు. ఎవరైనా ఆన్‌‌లైన్‌‌లో మార్చేందుకు యత్నించినా ఉన్నతాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ రికార్డులో సవరణలు చేయాలంటే భూముల రిజిస్ట్రేషన్‌‌ ప్రాసెస్‌‌లో భాగస్వామ్యమయ్యే అధికారులంతా ఓకే చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఏ మార్పు చేసినా, రికార్డులను దిద్దినా అధికారులంతా బాధ్యులయ్యే అవకాశం ఉండడంతో అవినీతికి, అక్రమాలకు ఆస్కారం ఉండబోదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఒకరికి రిజిస్ట్రేషన్‌‌ అయిన భూమిని మరొకరికి కూడా రిజిష్ట్రర్‌‌ చేసేవారు. దీనికి తమ బాధ్యత లేనట్లుగా సబ్‌‌ రిజిస్ట్రార్లు వ్యవహరించేవారు. ఇక మీదట అలా కుదరదు.