తెలంగాణ ఉద్యమంలో కళాకారులదే కీలక పాత్ర : మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణ ఉద్యమంలో కళాకారులదే కీలక పాత్ర : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • సకల జనులు పోరాడితేనే స్వరాష్ట్రం వచ్చింది: మంత్రి జూపల్లి
  • ప్రజా పాలన వీడియో రిలీజ్ ప్రోగ్రామ్​కు హాజరు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కళాకారులదే కీలక పాత్ర అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా సకల జనులు పోరాడితేనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బాబు జగజ్జీవన్ రావు భవన్ లో ఆదివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలనొచ్చొరో.. తెలంగాణ ప్రజల పాలయిందిరో తెలంగాణ” ఆడియో, వీడియోను మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్, గాయకుడు ఏపూరి సోమన్నతో కలిసి రిలీజ్ చేశారు. 

తెలంగాణ ఉద్యమం, గత పదేండ్ల పాలన, సీఎం రేవంత్ ప్రజా పాలనపై సాంస్కృతిక కార్యక్రమం ద్వారా కళాకారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. ‘‘ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా.. ఎన్నో ఏండ్ల డిమాండ్, కోట్లాది మంది పోరాటాన్ని గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో తెలంగాణ ఉద్యమ ఆశయాలు నెరవేరలేదు’’అని జూపల్లి అన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి ఏపూరి సోమన్న తన పాటలు, మాటలతో ప్రజలకు వివరించారని ఎంపీ మల్లు రవి అన్నారు.