- డాక్యుమెంట్లకు తిరుగులేని భద్రత
- రికార్డుల ట్యాంపరింగ్.. డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్
- సాఫ్ట్ వేర్ అప్‌డేట్ చేస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
- డీసెంట్రలైజ్డ్ వ్యవస్థతో నిమిషాల్లో లింకు డాక్యుమెంట్ల చరిత్ర
రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజిస్ట్రేషన్ల శాఖలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో భూమాఫియా, మధ్యవర్తుల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజిస్ట్రేషన్ల శాఖలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో భూమాఫియా, మధ్యవర్తుల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (కార్డ్) సాఫ్ట్‌వేర్‌ను మరింత ఆధునీకరిస్తూ, బ్యాక్-ఎండ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మరో మూడు నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేలా పనిచేస్తున్నారు. దీంతో నిషేధిత సర్వే నంబర్ల నమోదు, సర్వర్ సమస్యలు, రికార్డుల ట్యాంపరింగ్ వంటి అవినీతి అవకాశాలకు చెక్ పడనుంది. ముఖ్యంగా ఒకే సర్వే నంబర్‌పై జరిగే డబుల్ రిజిస్ట్రేషన్లను ఈ నూతన సాంకేతికత పూర్తిగా నిరోధించనుంది. డిజిటల్ సంతకాలు, ఆధార్ అనుసంధానంతో ప్రతి లావాదేవీని పకడ్బందీగా రికార్డు చేయనుండటంతో సామాన్య ప్రజల భూములకు పూర్తి భద్రత లభించనుంది.
అదేసమయంలో స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలో సాఫ్ట్‌వేర్ లెక్కగట్టి చూపిస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే కట్టవచ్చు. మధ్యవర్తులు "అదనపు ఖర్చులు అవుతాయి" అని చెప్పి మోసం చేసే అవకాశం ఉండదు. సామాన్య పౌరులు డాక్యుమెంట్ రైటర్లు లేదా ఏజెంట్లపై ఆధారపడకుండా, ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ఆటోమేటిక్ మ్యుటేషన్ సౌకర్యంతో పారదర్శకంగా తమ రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
- నకిలీ పత్రాలతో భూములు అమ్మలేరు
బ్లాక్‌చైన్ టెక్నాలజీ రాకతో రికార్డుల ట్యాంపరింగ్, ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీకి అవకాశం ఉండదు. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులను మార్చడం లేదా పేజీలను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండేవి. కానీ, బ్లాక్‌చైన్ పద్ధతిలో ప్రతి మార్పు ఒక ‘బ్లాక్’గా నమోదవుతుంది. దీనిని ఎవరూ సవరించలేరు. నకిలీ పత్రాలు సృష్టించి భూములు అమ్మే ప్రయత్నం చేస్తే, సిస్టమ్‌లోని అసలైన డేటాతో అది సరిపోలదు కాబట్టి సాఫ్ట్‌వేర్ వెంటనే తిరస్కరిస్తుంది.
ముఖ్యంగా అధికారులు పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు చేసే 'బ్యాక్ డేట్' అక్రమాలకు టైమ్- స్టాంపింగ్ ద్వారా శాశ్వత విముక్తి లభిస్తుంది. ప్రతి పని ఏ సెకనుకు జరిగిందో రికార్డ్ అవ్వడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. అంతేకాకుండా, బినామీ లావాదేవీలను నిరోధించేందుకు డిజిటల్ సంతకాలు, ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు.
- రిజిస్ట్రేషన్ డేటా మొత్తం డీసెంట్రలైజ్డ్
రిజిస్ట్రేషన్ డేటా మొత్తం 'డీసెంట్రలైజ్డ్' పద్ధతిలో ఉండటం ఈ సాంకేతికతలో ప్రధానమైనది. సమాచారం ఒకే సర్వర్‌పై కాకుండా నెట్‌వర్క్‌లోని అనేక నోడ్స్‌లో భద్రంగా ఉంటుంది. దీంతో సర్వర్ సమస్యలు తలెత్తవు. ప్రస్తుతం డేటా మొత్తం ఒకే చోట ఉండటం వల్ల, సిస్టమ్ హ్యాకింగ్‌కు గురైనా లేదా సర్వర్ విఫలమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు తరుచూ సర్వర్ డౌన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇక రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగేలా స్మార్ట్ కాంట్రాక్టులను రూపొందిస్తున్నారు. ఒక భూమికి సంబంధించి గత 30- నుంచి 40 ఏళ్ల లింకు డాక్యుమెంట్స్ చరిత్ర కేవలం నిమిషాల్లోనే కచ్చితత్వంతో వచ్చేలా చూడనున్నారు. ఈ కొత్త విధానం అందుబాటులోకి వసస్తే ఆస్తిపై ఉన్న తాకట్టులు, విక్రయాల వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
బ్యాక్-ఎండ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా నిషేధిత సర్వే నంబర్ల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన కోడింగ్‌ను కూడా రూపొందిస్తున్నారు. మొత్తం మీద ఈ మార్పులతో భూ రిజిస్ట్రేషన్లలో అవినీతి తగ్గి, కోర్టు కేసుల సంఖ్య భారీగా తగ్గుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
- మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్లు
ఆన్‌లైన్‌లోనే ఫీజుల చెల్లింపులు, స్లాట్ బుకింగ్ వంటి సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, బ్లాక్‌చైన్ అనుసంధానంతో అవి మరింత వేగవంతం కానున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్లు సాధ్యం కానున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం అమల్లో ఉన్న 'కార్డ్' సాఫ్ట్‌వేర్‌లో స్టాంప్ డ్యూటీ లెక్కించే సౌకర్యం ఉన్నప్పటికీ, అది పూర్తిగా వినియోగదారుడు ఇచ్చే సమాచారంపైనే ఆధారపడి పని చేస్తోంది.
అయితే, ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెడుతున్న బ్లాక్ చైన్ అప్‌గ్రేడెడ్ సాఫ్ట్‌వేర్ విధానంలో.. సర్వే నంబర్ నమోదు చేయగానే మార్కెట్ విలువలను సిస్టమే (ఆటోఫెచ్)లో ఆటోమేటిక్‌గా స్వీకరిస్తుంది. దీంతో ఏవైనా అనధికార మార్పులు చేయడం లేదా తప్పుడు లెక్కలు చూపడం అసాధ్యం కావడంతో పాటు, అధికారుల ప్రమేయం లేకుండానే స్టాంప్ డ్యూటీ లెక్క కచ్చితంగా వస్తుంది.
