కరోనా పోరులో బ్రేక్: రెండ్రోజుల స్ట్రైక్‌లోకి 6 లక్షల మంది ఆశా వర్కర్లు

కరోనా పోరులో బ్రేక్: రెండ్రోజుల స్ట్రైక్‌లోకి 6 లక్షల మంది ఆశా వర్కర్లు

పల్లె ప్రాంతాల్లో కరోనా వైరస్‌పై పోరులో క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్న ఆశా వర్కర్లు రెండ్రోజుల బంద్‌ ప్రకటించారు. కరోనా నియంత్రణలో నేరుగా ప్రజల వద్దకు వెళ్తూ సేవలు అందిస్తున్న తమ జీవితాలకు భద్రత కొరవడిందంటూ కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపుతో శుక్ర, శనివారాల్లో దేశ వ్యాప్తంగా 6 లక్షల మంది ఆశా వర్కర్లు స్ట్రైక్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రులతో పాటు సెంట్రల్ స్పాన్సర్డ్ న్యూట్రీషన్ స్కీమ్స్ వంటి సేవలను ప్రైవేటు పరం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ సమ్మెకు దిగినట్లు ప్రకటించారు. ఈ ప్రపోజల్‌ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెలకు రూ.21 వేల కనీస వేతనం, పది వేల చొప్పున పెన్షన్ ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కరోనా ఫ్రంట్ లైనర్స్‌గా  ఉన్న తమకు ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ ఇవ్వాలని నినదించారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి బెనిఫిట్స్ కూడా కల్పించాలని కోరుతున్నారు. ఈ సమ్మెలో ఆశా వర్కర్లతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు, నేషనల్ హెల్త్ మిషన్ సహా పలు సెంట్రల్ స్కీమ్స్‌ కింద పని చేసే సిబ్బంది కూడా పాల్గొనాలని ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు శుక్రవారం దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆశా వర్కర్లు నిరసనలు చేపట్టారు. కరోనా విధుల్లో ఉన్న తమకు రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌లో భాగంగా 2005లో నాటి ప్రభుత్వం ఆశా వర్కర్స్ వ్యవస్థను ప్రారంభించింది. గ్రామాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు  కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా ఆశా వర్కర్లు ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి హెల్త్ సర్వేలు చేయడం సహా అనుమానితులకు, హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స పొందుతున్న బాధితులకు సేవలు అంధించడంలో వీరిని వినియోగించుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే తమకు సేఫ్టీ కిట్స్ ఇవ్వడం లేదని గత నెలలో కర్ణాటకలో 40 వేల మంది ఆశా వర్కర్లు సమ్మెకు దిగారు. తమ జీతాలను కనీసం 12 వేలకు పెంచాలని ఆ సమయంలో డిమాండ్ చేశారు.