- బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం డీసీసీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ధరణి లోపాలతో కొంతమంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, సెట్ బ్యాక్ లను సరిచేసి అర్హులు లబ్ధి పొందేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు స్పష్టమైన ఆదేశాలు బ్యాంకర్లకు వెళ్లాయన్నారు.
చట్ట పరిధిలో పనిచేస్తున్న హైడ్రా మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇండ్ల జోలికి వెళ్లడం లేదని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చి వేస్తోందన్నారు. రుణమాఫీ, హైడ్రాపై బీఆర్ఎస్ లీడర్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బీజేపీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని
ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ జర్నీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500 వంట గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచిన విషయం బీజేపీ కనబడడం లేదా? అని ప్రశ్నించారు.
పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ
టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తరువాత మహేశ్‌కుమార్ గౌడ్ ఈ నెల 4 న మొదటిసారి జిల్లాకు వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయనకు ఘన స్వాగతం పలుకనున్నట్టు చెప్పారు. నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.