కిన్నెరసాని వాగులో దొరికిన యువకుల డెడ్‌బాడీలు

కిన్నెరసాని వాగులో దొరికిన యువకుల డెడ్‌బాడీలు
  • శుభకార్యానికి వెళ్లి.. ఇంటికి వెళ్తూ వాగులో గల్లంతు 
  • ఇద్దరి మృతితో ఖమ్మం జిల్లా లచ్చుగూడెంలో తీవ్ర విషాదం

శుభకార్యక్రమానికి వెళ్లి ఇంటికి పోతుండగా వాగు దాటుతూ గల్లంతైన ఇద్దరి డెడ్ బాడీలు లభించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. టేకులపల్లి మండలం లచ్చగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు(29), సాయికుమార్​(23) బావబామ్మర్దులు. ఆదివారం సాయి మేనల్లుడి పుట్టు వెంట్రుకల మొక్కు మేడారంలో ఉండగా..  భారీ వర్షాలతో వాగు పొంగుతుండగా అటు వెళ్లలేదు. వెనక్కి మళ్లి గుండాల మండలం వేపలగడ్డలోని సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు గద్దెల వద్ద మొక్కు చెల్లించుకున్నారు.  

అక్కడికి వెళ్లిన సాయికుమార్,  వెంకటేశ్వర్లు అదే రోజు సాయంత్రం సొంతూరు వెళ్తున్నారు. ఆళ్లపల్లి మండలం రాయపాడు వద్ద కిన్నెరసాని బ్రిడ్జిపై వరద పారుతుండగా బైక్ తో దాటుతూ  కొట్టుకుపోయా రు. రాత్రి కావడంతో ఎవరూ చూడలేదు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టేకులపల్లి పీఎస్ లో కంప్లయింట్ చేశారు. పోలీసులు సెల్​ఫోన్​సిగ్నల్​ద్వారా గుర్తించి వాగులో కొట్టుకపోయినట్లు అంచనావేశారు. సోమవారం ఆళ్ళపల్లి, బోడు పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గాలించినా ఫలితంలేదు. 

మంగళవారం ఉదయం లక్ష్మీదేవిపల్లి మండలం చింతకుంట సమీపంలో కిన్నెరసాని నది ఒడ్డున రెండు డెడ్ బాడీలను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి మృతులను వెంకటేశ్వర్లు, సాయికుమార్ గా గుర్తించి కుటుంబసభ్యులకు తెలిపారు. ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.  సాయి భార్య గర్భిణి. వెంకటేశ్వర్లుకు భార్య, ఏడాది వయసు కూతురు ఉన్నారు.  డెడ్ బాడీలు ఉబ్బి ఉండడంతో  కొత్తగూడెం స్పెషల్​ బ్రాంచ్​ ఎస్ ఐ రాజేందర్​ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

సైదాబీ మృతదేహం లభ్యం

కూసుమంచి:  రెండు రోజుల కింద ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద వరదలో  యాకుబ్ (50), సైదాబీ (45) దంపతులు గల్లంతైన విషయం తెలిసిందే.  సోమవారం యాకూబ్​డెడ్ బాడీ దొరకగా.. మంగళవారం సైదాబీ మృతదేహం మండలంలోని జక్కేపల్లి పాలేరు వాగులో లభ్యమైంది. డెడ్ బాడీని పోస్టుమార్టం​కోసం పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు.