
థానే: నాలాలో నాలుగేండ్ల బాలుడి డెడ్‌బాడీ కొట్టుకొచ్చిన ఘటన మహారాష్ట్ర థానే సిటీలో జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో థానేలోని కాల్వా ఏరియాలో భాస్కర్‌నగర్ కాలనీకి చెందిన ఆదిత్యా మౌర్య (4) గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు నాలాలో కొట్టుకుపోయాడు. ఆ బాలుడి మృతదేహాన్ని మఫత్‌లాల్ కంపెనీ ఏరియాలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఫైర్, రిజినల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ (ఆర్‌డీఎంసీ) సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.
అలాగే, థానే సిటీలోని ద్యానేశ్వర్ నగర్‌లో ఉన్న నాలాలో 30 ఏండ్ల వ్యక్తి డెడ్‌బాడీని శుక్రవారం గుర్తించినట్లు అధికారులు చెప్పారు. వర్షాల కారణంగా గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి నాలాలో పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్లు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. థానే సిటీలో శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య 7.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల తమకు సాయం చేయాలని కోరుతూ ఫైర్ సిబ్బందికి, ఆర్‌డీఎంసీకి వందల కాల్స్ వస్తున్నాయి.