
వన్ నేషన్ వన్ రేషన్తో బయటపడిన బోగస్ కార్డులు
మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1.49 కోట్ల కార్డుల తొలగింపు
హైదరాబాద్, వెలుగు: రేషన్ సరుకుల పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంస్కరణలతో బోగస్ కార్డులకు చెక్ పడుతోంది. రేషన్ కార్డులతో ఆధార్డేటాను అనుసంధానం చేయడంతో ఒకే పేర్లతో వివిధ ప్రాంతాల్లో ఉన్న రేషన్ కార్డుల వ్యవహారం గత మూడేళ్లుగా బయట పడుతూ వస్తోంది. దీంతో డబుల్ రేషన్ కార్డులు, బోగస్ కార్డులు తొలగిస్తున్నారు. ఇలా గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1.49 కోట్ల బోగస్ కార్డులు ఏరివేసినట్లు ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ రిపోర్టులో వెల్లడించింది. దక్షిణాదిలో తెలంగాణలో అత్యధికంగా 5.2 లక్షల బోగస్ కార్డులను తొలగించగా కేరళలో అత్యల్పంగా కేవలం 3,314 మాత్రమే బోగస్వని తేలింది. దీనికితోడు చనిపోయిన వారి పేరిట ఉన్న కార్డులు, ఆదాయం ఎక్కువగా ఉండి రేషన్ కార్డులు పొందినవారిని సైతం గుర్తించారు.
అన్ని రాష్ట్రాల అనుసంధానం
అక్టోబరు 2015 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థలో కొత్త సంస్కరణలు చేపట్టారు. గత ఏడాది నుంచి పైలెట్ ప్రాజెక్టు ద్వారా వన్ నేషన్ వన్రేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఒకవైపు ఆధార్ సీడింగ్, మరోవైపు వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేయడంతో పెద్దఎత్తున బోగస్ కార్డులు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో అత్యధికంగా బోగస్ కార్డులు తొలగించారు. ఆంధ్రప్రదేశ్లో 4.98 లక్షలు, కర్ణాటకలో 4.75 లక్షలు, తమిళనాడులో 93,559 బోగస్ కార్డులు తొలగించారు.