
- నెల రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు.. ఇప్పటిదాకా 109 మంది మృతి.. రూ.883 కోట్ల నష్టం
- నేషనల్ హైవే సహా 226 రోడ్లు మూసివేత.. జనజీవనం అస్తవ్యస్తం
సిమ్లా/తిరువనంతపురం: హిమాచల్ ప్రదేశ్‌లో నెలరోజులు( జూన్ 20 నుంచి జులై 16)గా కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం109 మంది చనిపోయారు. ఇందులో 64 మంది వర్షాలకు సంబంధించిన ఘటనల్లో, 45 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్‌ఈవోసీ) గురువారం వెల్లడించిన నివేదిక ప్రకారం.. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఓ నేషనల్ హైవే సహా 226 రోడ్లను మూసివేశారు. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, మండి, కులు, కాంగ్రా, సిర్మౌర్ వంటి పలు జిల్లాల్లో 52 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ రీజియన్లు (డీటీఆర్‌లు),137 నీటి సరఫరా స్కీములకు అంతరాయం కలిగింది. ల్యాండ్‌స్లైడ్‌లు, వరదలు, క్లౌడ్‌బరస్ట్‌లు, కరెంట్ షాక్, పాము కాట్లు, ఎత్తయిన ప్రాంతాల నుంచి పడిపోవడం వల్ల చాలా మంది చనిపోయారు. కాంగ్రా జిల్లాల్లో అత్యధికంగా 16 మంది మృతి చెందగా..హమీర్‌పూర్ లో 8, కుల్లులో 4, చంబాలో ముగ్గురు చనిపోయారని ఎస్‌ఈవోసీ వివరించింది. ఇక రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటిదాకా మొత్తం 45 మంది చనిపోయారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు రూ.883 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 1,228 పశువులు, 21,500 కోళ్లు కూడా చనిపోయాయని ఎస్‌ఈవోసీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈవోసీ ద్వారానే వరదలపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నది. జిల్లా యంత్రాంగాలతో కలిసి వేగవంతమైన సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలను చేపడుతోంది. బాధిత కుటుంబాలకు పరిహారం, సహాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లోనూ భారీ వర్షం పడనున్నట్లు వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరదలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాల వల్ల గత మూడేండ్లలో రాష్ట్రానికి రూ.21,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. కేంద్రమే తమను ఆదుకోవాలని సీఎం అభ్యర్థించారు.
కేరళలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. లోతట్టు ప్రాంత్లాల్లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా కాసరగోడ్ జిల్లాలోని ఉప్పల, మంజేశ్వరం, మధుర్, పుత్తిగె నదుల నీటిమట్టం పెరిగింది. ఈ నదుల తీరంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోజికోడ్‌లోని కొరపుజ, కుట్టియాడి నదులు, కన్నూర్‌లోని పెరుంబ, వయనాడ్‌లోని కబనీ నదులకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు కొనసాగుతుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.