
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ తర్వాత, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రుణ ఖాతాను 'ఫ్రాడ్'గా వర్గీకరించింది. ఈ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీ ఫండ్స్‌ను దారి మళ్లించారని తెలిపింది.
బీఓఐ నుంచి 2016లో రూ.700 కోట్ల అప్పును ఆర్‌కామ్ తీసుకుంది. ఇందులో సగం అమౌంట్‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఇది లోన్ అగ్రిమెంట్‌కు విరుద్ధమని బీఓఐ పేర్కొంది. ఆర్‌కామ్ ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 8న పంపిన లేఖలో అనిల్ అంబానీ, మంజరి కక్కర్ పేర్లను ఫ్రాడ్ వర్గీకరణలో చేర్చింది.
ఎస్‌బీఐ కూడా తామిచ్చిన లోన్లను ఆర్‌కామ్ తప్పుగా వాడిందని, లోన్ అగ్రిమెంట్ రూల్స్‌ను ఉల్లంఘించిందని సీబీఐకి ఫిర్యాదు చేసింది. రూ.2,929 కోట్ల నష్టం వచ్చిందని తెలిపింది. బీఓఐ ఆరోపణలపై అంబానీ ప్రతినిధి స్పందిచారు. “అంబానీ అప్పట్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాత్రమే” అని తెలిపారు.