అందుబాటులోకి బొల్లారం కరోనా ఆస్పత్రి

అందుబాటులోకి బొల్లారం కరోనా ఆస్పత్రి
  • ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బొల్లారం కంటోన్మెంట్ లో కరోనా హాస్పిటల్ ను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం బొల్లారం PHCని 50 పడకల కరోనా హాస్పిటల్ గా మార్చాలని గతంలోనే నిర్ణయించారు. PHCని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి.. తన సొంత నిధులు, ఎంపీ నిధులను ఖర్చు చేయనున్నారు. 50 ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంతో కరోనా హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి నుంచే నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే వంద ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో.. పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కరోనా హాస్పిటల్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

‘కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు బొల్లారం ఆసుపత్రి రెడీ అయింది.మొదటి దశలో 50 పడకల సౌకర్యంతో పాటు, 50 సిలెండర్ల ఆక్సిజన్, ఇతర వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేశాం. నా నియోజకవర్గంలో ప్రజలకు కష్టకాలంలో ఇది కొంతైనా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాను. నా ఆలోచన కార్యరూపం దాల్చడానికి సంకల్పంతో, ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని సహకరించిన అధికార, అనధికారిక వ్యక్తులు, సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కష్టకాలంలో మానవతాదృక్పథంతో స్పందించిన దాతలకు అభినందనలు. సాటి మనిషికి భరోసా ఇస్తూ... కోవిడ్ ను జయిద్దాం’ అని ఆయన ట్వీట్ చేశారు.