
‘ఈ ప్రపంచానికి మనం ఎంత దూరం ఉన్నామో రియలైజ్ అయ్యేది ఎప్పుడంటే... మనకు మనం దగ్గరయినప్పుడు’ అని అంటాడు పంకజ్ త్రిపాఠి. అవకాశాల కోసం క్షణ క్షణం వేచి చూసిన ఆయనదగ్గరికే ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. సుమారు ఇరవైయ్యేళ్ల స్ట్రగుల్ తర్వాత అవకాశాలను అందుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు పంకజ్ పరిచయం ఇది.
చిన్న ఇల్లు. రైతు కుటుంబం. బీహార్‌లోని బెల్సాంద్ పట్టణంలో పంకజ్ త్రిపాఠిది మధ్య తరగతి జీవితం. ఒక్క ఫోన్ కాల్ వస్తే చాలని, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రోజులవి. ఇంట్లో ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండేవి కాదు. సిగ్నల్ ఉన్న ప్లేస్‌లో ఫోన్ ఉంచి ఫోన్ రింగ్ కోసం రోజంతా ఎదురు చూసేవాడు. ఫోన్ రింగ్ కాకపోతే తెగ బాధపడేవాడు. ఆ బాధతోనే తెల్లారేది. పదిహేనేళ్ల కిందట పంకజ్ పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు.. ఫోన్ రింగ్ కాని రోజు లేదు. ‘ ఒక్కోసారి కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్న’ అనేంత బిజీ అయిపోయాడు.
నటన.. జీవితం..
లైఫ్ టార్గెట్ యాక్టింగ్. అయినా.. బతకడానికి డబ్బులు కావాలని చిన్నప్పటి నుంచి బతుకు పోరాటం చేశాడు త్రిపాఠి. యాక్టింగ్ ప్రయత్నాలు అటుంచితే... జీవితం మొదట్లోనే తోచిన పని చేశాడు. ఓ హోటల్లో డైలీవేజ్కి పని చేశాడు. అక్కడ పని చేస్తూనే యాక్టింగ్ పై ఫోకస్ చేసేవాడు. ఇంటర్మీడియట్ 1996లో పూర్తైంది. ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో చేరాడు.
యాక్టింగ్ స్కూల్లో చేరాలన్నా, ఫిల్మ్స్ చదవాలన్నా కనీస అర్హత డిగ్రీ. మళ్లీ కాలేజీ దారి పట్టాడు. డిగ్రీ పట్టా కోసమే కాలేజీలో చేరాడు పంకజ్. నైట్ షిఫ్ట్ హోటల్స్‌లో పని చేసేవాడు. మళ్లీ ఉదయం కాలేజీకి వెళ్లేవాడు. ఐదు గంటలు మాత్రమే నిద్ర పోయి.. యాక్టింగ్, కాలేజీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసేవాడు. యాక్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఒక్కరూపాయి కూడా ఉండేది కాదు. తండ్రి సాయం చేసేవాడు కాదు.
మార్చిన జైలు జీవితం
కాలేజీలో ఉన్నప్పుడు పంకజ్ స్టూడెంట్ లీడర్‌గా ఉన్నాడు. విద్యార్థుల కోసం ఆందోళన చేసిన కారణంగా పోలీసులు పంకజ్‌ను అరెస్ట్ చేసి, వారం రోజులు జైలుకు పంపారు. ఆ జైలు అనుభవమే పంకజ్ లైఫ్‌ను మార్చింది. వారం రోజులు జైల్లో ఒంటరిగా ఉన్నాడు పంకజ్. వంట చేసుకోవాల్సిన పని లేదు. ఇంకోపని లేదు. తెలిసిన వాళ్లు లేరు, మాట్లాడించేవాళ్లు అంతకన్నా లేరు. దీంతో తన లైఫ్ గురించి ఆలోచించే టైం దొరికింది. ఒంటరిగా ఉన్న అతనికి .. తానేంటో అర్థమైంది. ప్రపంచానికి అతను ఎంత దూరంగా ఉన్నాడో తెలుసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఆఫ్ డ్రామా కాలేజీలో చేరాడు. అక్కడ డ్రామా థియేటర్‌కు రోజూ వెళ్లేవాడు. కాలేజీ చదువు 2004లో పూర్తైంది. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లాడు.
ముంబై వచ్చేటప్పటికి పంకజ్‌కు పెళ్ళికావడంతో. కుటుంబాన్ని పోషించడం సవాలుగా మారింది. చేతిలో పైసా లేదు. ఇల్లు రెంట్ కట్టడం పంకజ్ ముందున్న అతిపెద్ద టాస్క్. పెద్ద యాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ కంటే.. ముందు ఇల్లు రెంట్ కట్టేంత డబ్బు సంపాదించుకుంటే చాలు అనుకున్నాడు. చిన్న సినిమాలు, నాటకాలో వేసాలు వేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. ఇలా సుమారు ఎనిమిదేళ్లు స్లోగా జీవితం సాగింది. ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ అవకాశం వచ్చింది. పెద్ద క్యారెక్టర్, మంచి కథ.. అదీ బిహార్ నేపథ్యంతో ఉన్న సినిమా కావడంతో పంకజ్‌కు మంచి అవకాశంగా భావించాడు. అనుకున్నట్టుగానే గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2012లో పెద్ద హిట్‌గా మారింది. పంకజ్‌కు కూడా లైఫ్ బ్రేక్ దొరికినట్టయింది. అప్పటి నుంచి బాలీవుడ్లో సినిమా అవకాశాలు వచ్చాయి. నటనా జీవితానికి తలుపులు తెరుచుకున్నాయి. చాలా సినిమాల్లో విలన్‌గా, కమెడియన్‌గా స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేశాడు పంకజ్. యాక్టింగ్‌లో డెడికేషన్ చూపిస్తూ పాత్రకు న్యాయం చేసేవాడు. అతను ‘ఫక్రీ’, ‘నీల్ బత్తీ సన్నాట’, ‘బార్లీ కీ బర్ఫీ’ వంటి పెద్ద సినిమాలతో పాటు అనేక సినిమాల్లో అవకాశాలను పొందాడు. 2017లో వచ్చిన న్యూటన్ సినిమా ద్వారా ‘స్పెషల్ మెన్షన్’ కేటగిరీలో నేషన్ అవార్డు కూడా అందుకున్నాడు పంకజ్. 2018లో వచ్చిన ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్ ద్వారా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇటీవల వచ్చిన ఫ్యామిలీమ్యాన్ సిరీస్ పంకజ్ రెప్యుటేషన్‌ను మరింత పెంచింది.