బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర ప్రస్థానం ఇదే..

బాలీవుడ్  లెజెండ్ ధర్మేంద్ర  ప్రస్థానం ఇదే..

 

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 300లకు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర.. యాక్షన్‌ కింగ్‌గా, బాలీవుడ్‌  హీ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. 2004లో బీజేపీ ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం ధర్మేంద్రను బాగా ప్రభావితం చేసింది. రాజస్తాన్​లోని బికనీర్ లోక్​సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2012లో ధర్మేంద్రను పద్మభూషణ్‌తో సత్కరించింది.

ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం కన్నుమూశారు. గతకొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. అక్టోబరు 31న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ధర్మేంద్రను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సోషల్​ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఫేక్ న్యూస్​ను కుటుంబ సభ్యులు ఖండించారు. 12 రోజుల పాటు హాస్పిటల్​లోనే ఉన్నారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మళ్లీ హెల్త్ కండీషన్ క్రిటికల్​గా మారడంతో ఇంట్లోనే కన్నుమూశారు. 300 పైగా సినిమాల్లో నటించిన ఆయన.. యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు పొందారు. ధర్మేంద్ర డెడ్​బాడీని అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ఆయన చనిపోయారన్న వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

బికనీర్ నుంచి ఎంపీగా సేవలు

2004లో బీజేపీ ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం ధర్మేంద్రను బాగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆయన శతృఘ్న సిన్హాతో కలిసి లాల్ కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. రాజస్తాన్​లోని బికనీర్ లోక్​సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ధర్మేంద్ర బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్వర్ లాల్ దూడిని దాదాపు 60 వేల ఓట్ల తేడాతో ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2009లో పదవీకాలం ముగియగానే రాజకీయాలకు స్వస్తి పలికారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2012లో ధర్మేంద్రను పద్మభూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సత్కరించింది.

ప్రముఖుల సంతాపాలు

ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చిత్ర పరిశ్రమకు తీరని లోటు’ అని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ సానుభూతి తెలియజేశారు. ధర్మేంద్ర కుటుంబానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు   ధర్మేంద్ర మృతికి సంతాపం ప్రకటించారు.