కేరళలో పేలుళ్లు ఇద్దరు మృతి.. లొంగిపోయిన నిందితుడు

కేరళలో పేలుళ్లు ఇద్దరు మృతి.. లొంగిపోయిన నిందితుడు
  • వీరిలో కొందరి పరిస్థితి విషమం
  • క్రైస్తవ మత ప్రార్థనలు జరుగుతుండగా ఘటన
  • పేలుళ్లకు ఐఈడీ వినియోగించినట్టు డీజీపీ వెల్లడి

కేరళలోని ఎర్నాకులం జిల్లా కలమస్సేరీలో మత ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్​ సెంటర్​లో వరుసగా మూడుసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ఇద్దరు చనిపోగా, 52 మంది గాయపడ్డారు. 

కొచ్చి: కేరళలోని కొచ్చిలో దారుణం జరిగింది. ఆదివారం మత ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్​లో వరుసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. మొత్తం 52 మంది పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

క్రిస్టియన్  రిలీజియస్  గ్రూప్ ‘యెహోవాస్ విట్ నెసెస్’ ఆధ్వర్యంలో ఎర్నాకుళం జిల్లా కలమస్సేరీలోని జమ్రా ఇంటర్నేషనల్  కన్వెన్షన్ సెంటర్​లో మూడ్రోజుల పాటు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీనికి వందలాది మంది హాజరయ్యారు. ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా ఒకదాని తర్వాత ఒకటి మూడు బాంబులు పేలాయి. ఈ పేలుళ్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నాయి.

ప్రార్థనలు చేస్తున్న టైమ్​లో..  

పేలుళ్ల ధాటికి కన్వెన్షన్ సెంటర్ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ప్రార్థనలు చేస్తున్న భక్తులు.. పేలుళ్ల శబ్దం విని కండ్లు తెరిచి చూసే సరికి సెంటర్ లో మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ భయంతో డోర్ వద్దకు పరుగులు పెట్టారు. సెంటర్ లో మంటలు అంటుకున్న, చెల్లాచెదురుగా పడి ఉన్న కుర్చీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, పేలుళ్లకు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) వాడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీజీపీ షేక్ దర్వేశ్ సాహెబ్ తెలిపారు. ‘‘మేం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఇది టెర్రర్ దాడినా? కాదా? అనేది ఇప్పుడే చెప్పలేం. దీని వెనుక ఎవరున్నది కనిపెట్టి, కఠిన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.  

ఇయ్యాల ఆల్ పార్టీ మీటింగ్.. 

పేలుళ్ల ఘటనపై కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్, సీఎం విజయన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. పేలుళ్ల ఘటన నేపథ్యంలో సోమవారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. కాగా, పాలస్తీనాకు కేరళ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో టెర్రర్ అటాక్ జరిగి ఉండొచ్చని సీపీఎం స్టేట్ సెక్రటరీ ఎంవీ గోవింద్ అన్నారు.

అందుకే పేలుళ్లు జరిపిన: మార్టిన్ 

బాంబు పేలుళ్లకు తానే కారణమంటూ ఓ వ్యక్తి త్రిసూర్ పోలీసుల ముందు లొంగిపో యాడు. ‘యెహోవాస్ విట్ నెసెస్’ గ్రూప్​లోనే తాను ఉన్నానన్నాడు. ‘‘పేలుళ్లు జరిపింది తానేనని డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి లొంగిపో యాడు. అందుకు కొన్ని ఆధారాలు కూడా ఇచ్చాడు. వాటిని పరిశీలిస్తున్నాం” అని ఏడీజీ ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. కాగా, పోలీ సులకు లొంగిపోయే ముందు మార్టిన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ‘‘నేను ‘యెహోవాస్ విట్ నెసెస్’ ఆర్గనైజేషన్​లో 16 ఏండ్లుగా పని చేస్తున్నాను. అక్కడ దేశద్రోహ పాఠాలు చెబుతున్నారు. అది మార్చుకోవాల ని చెప్పినా వినలేదు. అందుకే ఇలా చేశాను” అని వీడియోలో పేర్కొన్నాడు.