తిరుపతి పట్టణానికి బాంబు బెదిరింపులు : 4 ప్రాంతాల్లో RDX పెట్టామంటూ మెయిల్స్

తిరుపతి పట్టణానికి బాంబు బెదిరింపులు : 4 ప్రాంతాల్లో RDX పెట్టామంటూ మెయిల్స్

తిరుపతి పట్టణంలో హై టెన్షన్. టౌన్ లోని నాలుగు చోట్ల RDX బాంబులు పెట్టాం అంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు ఈ మెయిల్స్ వచ్చాయి. 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం వచ్చిన బెదిరింపులతో తిరుపతి పోలీసులు అప్రమత్తం అయ్యాయి. శ్రీవారి భక్తులతో తిరుపతి పట్టణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. హోటళ్లు బిజీగా ఉంటాయి. పర్యాటకులతో హడావిడి ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చిన బెదిరింపు మెయిల్స్ ను సిల్లీగా.. లైట్ గా తీసుకోకుండా అప్రమత్తం అయ్యారు పోలీసులు. తమిళనాడు పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ లో తిరుపతి పట్టణం పేరు కూడా ఉండటంతో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు పోలీసులు.

తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం, న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. 6వ తేదీ సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల పేరుతో బెదిరింపులు రావటంతో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు.

ALSO READ : తిరుమల శ్రీవారి సేవ అడ్వాన్స్ బుకింగ్ పై టీటీడీ కీలక నిర్ణయం..

తిరుపతిలోని అగ్రికల్చరల్ కాలేజీ హెలిప్యాడ్ దగ్గర కూడా తనిఖీలు చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యి.. అన్ని చోట్ల క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తిరుపతిలో భక్తులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, లింకు బస్టాండు, విష్ణు నివాసం ప్రాంతాల దగ్గర ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా అన్న అనుమానాలతో తనిఖీలు చేపట్టింది. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని తిరుపతి పోలీస్ శాఖ ప్రకటించింది.

తిరుపతికి వచ్చే భక్తులతోపాటు స్థానికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. తమిళనాడులోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయని.. తిరుపతి పట్టణంలోనూ బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయని.. అవి ఎవరు పంపించారు.. ఎక్కడి నుంచి వచ్చాయనేది విచారణ చేస్తున్నామని.. తిరుపతి ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని స్పష్టం చేశారు జిల్లా పోలీసులు.