తిరుమల శ్రీవారి సేవ అడ్వాన్స్ బుకింగ్ పై టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల శ్రీవారి సేవ అడ్వాన్స్ బుకింగ్ పై టీటీడీ కీలక నిర్ణయం..

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సేవకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని 3 నెలల నుంచి 1 నెలకు తగ్గించాలని ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారని అన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలు శ్రీవారి అనుగ్రహంతో విజయవంతమైందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, సేవకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. మాడవీధులలోని గ్యాలరీల్లో షెడ్లు ఏర్పాటు చేయాలని..ఎక్కువ మంది భక్తులు సూచించడంతో, అధునాతన టెక్నాలజీతో షెడ్ల నిర్మాణంపై ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించినట్టు వెల్లడించారు ఈవో అనిల్ కుమార్. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లో షెడ్లు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.

ఈసారి డయల్ యువర్ ఈవో ద్వారా మొత్తం 23 మంది భక్తులు సూచనలు ఇచ్చారని... అంగప్రదక్షిణం టోకెన్లను మరోసారి ఆఫ్‌లైన్ విధానంలో కేటాయించాలని భక్తులు కోరుతున్నారని అన్నారు. అలాగే ఆలయ సేవల కోసం ఉన్న అడ్వాన్స్ బుకింగ్ వ్యవధిని 3 నెలల నుంచి 1 నెలకు తగ్గించాలని చాలా మంది భక్తులు అభ్యర్థించినట్టు తెలిపారు. ఆన్‌లైన్ లక్కీడిప్‌లో బల్క్ బుకింగ్స్, అవకతవకలు జరుగుతున్నాయన్న భక్తుల ఆందోళనలను గుర్తించి, అవసరమైతే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్

భక్తుల సూచనలను బోర్డు దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టీటీడీలో జిఎస్టీ తగ్గింపును అమలు చేశామని..దీంతో భక్తులకు ఆర్థికంగా లాభం కలుగుతోందని అన్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతర ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఫైన్ మైక్రో ప్లానింగ్ చేస్తూ మరింత సౌకర్యాలు కల్పించనున్నామని వెల్లడించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.