సిరిసిల్ల, ములుగు కోర్టులకు బాంబు బెదిరింపు..  రంగంలోకి స్పెషల్ స్క్వాడ్.. విస్తృత తనిఖీలు

సిరిసిల్ల, ములుగు కోర్టులకు బాంబు బెదిరింపు..  రంగంలోకి స్పెషల్ స్క్వాడ్.. విస్తృత తనిఖీలు
  • కోర్టు అఫీషియల్  మెయిల్ కు మెసేజ్?

రాజన్నసిరిసిల్ల/ములుగు, వెలుగు: రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టు అఫీషియల్  మెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్​ పంపగా, సోమవారం ఉదయం సిబ్బంది  మెయిల్ ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరూ బయటకు వెళ్లిపోయారు.

పోలీసులు వెంటనే కోర్టులకు చేరుకొని డాగ్, బాంబ్​స్క్వాడ్  బృందాలతో తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో న్యాయవాదులు, కక్షిదారులు ఆందోళనకు గురయ్యారు. రికార్డ్​ రూమ్​లు, కోర్టు హాళ్లు, పార్కింగ్  ప్రదేశాలను పరిశీలించారు.

తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఫేక్​ మెయిల్  అని నిర్ధారణకు వచ్చారు.  బాంబు కలకలంతో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ  శ్రీనివాస్, ములుగు ఎస్సై ఉపేందర్​ రావు  తెలిపారు.