ముంబై: స్పెర్మ్, అండం దానం చేసిన వారికి, వాటితో జన్మించిన పిల్లలపై చట్టపరంగా ఎలాంటి హక్కు ఉండదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. బయోలాజికల్ పేరెంట్స్‌గా క్లెయిమ్ చేసుకునే చాన్స్ వారికి లేదని ఓ కేసు విచారణలో తేల్చిచెప్పింది. తన ఐదేండ్ల కవల కుమార్తెలను చూసేందుకు మహిళకు(పిటిషనర్) అనుమతిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.
పిటిషనర్ జంటకు సహజంగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడంతో వారు అండం దాత, సరోగసీ వైపు మొగ్గు చూపారు. పిటిషనర్ తన చెల్లి నుంచి 2018 డిసెంబర్లో అండాలు దానంగా తీసుకున్నారు. సరోగేట్ తల్లి ద్వారా 2019 ఆగస్టులో కవల పిల్లలను కన్నారు. 2021 వరకు పిల్లలతో భార్యభర్తలిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అదే ఏడాది మార్చిలో భర్త పిల్లలతో సహా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు.
మరోవైపు, అండాల దాత అయిన పిటిషనర్ సోదరి ఓ ప్రమాదంలో భర్త, కూతురును కోల్పోయింది. దీంతో ఆమెను తన భర్త ఇంటికి తీసుకెళ్లారని, తన పిల్లలతో కలిసి వారంతా ఒకే ఇంట్లో ఉంటున్నారని పిటిషన్ దారు చెప్పింది. పిల్లలను చూసేందుకు భార్య(పిటిషన్ దారు) ను అనుమతించలేదు. దీంతో ఆమె 2023లో కోర్టును ఆశ్రయించారు. సరోగసీ ద్వారా జన్మించిన తన కవల కుమార్తెలను చూసేందుకు అనుమతించడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీన్ని విచారించిన దిగువ కోర్టు.. పిల్లలను కలిసేందుకు ఆమెకు హక్కులేదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న నాయమూర్తి జస్టిస్ మిలింద్ జాదవ్ ఈ వాదనను అంగీకరించలేదు. పిటిషనర్ చెల్లెలు అండం దాత అయినప్పటికీ బయోలాజికల్ తల్లిగా క్లెయిమ్ చేసే చట్టబద్ధమైన హక్కు ఆమెకు లేదని పేర్కొన్నారు. సరోగసీ, స్పెర్మ్, అండాల దాతల అంశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) గైడ్‌లైన్స్
ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు.
