దర్బార్ మైసమ్మకు ఘనంగా బోనాలు .. పట్టువస్త్రాలు సమర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు వివేక్, లక్ష్మణ్

దర్బార్ మైసమ్మకు ఘనంగా బోనాలు .. పట్టువస్త్రాలు సమర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు వివేక్, లక్ష్మణ్

మెహిదీపట్నం/జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్​ కార్వాన్​లోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ  శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆషాఢమాస బోనాల ఉత్సవాల కోసం నగరంలోని అన్ని దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసిందని తెలిపారు. 

చల్లంగా చూడు మైసమ్మ తల్లి అంటూ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా  కార్వాన్ కేసరి హనుమాన్ దేవాలయం నుంచి  ప్రారంభమైన శోభాయాత్రలో  స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

బోరబండలో 25 ఆలయాలకు పట్టువస్త్రాలు

బోరబండలోని 25 అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పూజ సామగ్రిని ఆలయ కమిటీ సభ్యులకు మంత్రి వివేక్​ వెంకటస్వామి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని, ప్రజలంతా సంతోషంగా కలిసి జరుపుకోవాలని కోరారు. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్, ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.