
- పాతబస్తీ సహా నగరంలోని ఆలయాలకు భక్తుల క్యూ
- లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
- ధూల్‌పేట వేడుకల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ సిటీ, వెలుగు: భాగ్యనగరం బోనమెత్తింది.. హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ ధూంధాంగా జరిగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న, మీరాలంమండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహాకాళేశ్వర, చార్మినార్‌భాగ్యలక్ష్మి ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు.
అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు మహిళలు తరలివచ్చారు. పాతబస్తీతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీలు, బస్తీల్లోని అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. డప్పుదరువులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయాల పరిసరాలు మార్మోగాయి.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..
బోనాల జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో మంత్రులు, నాయకులు, అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు, సుల్తాన్‌షాహిలోని జగదాంబ ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహేశ్వరం నియోజకవర్గంలోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క పట్టువస్త్రాలు సమర్పించారు.
అలాగే ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గౌలిగూడ ఆలయంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, నాచారం మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, పాతబస్తీలోని బంగారు మైసమ్మ ఆలయంతో పాటు అంబర్‌పేటలోని మహంకాళి ఆలయంలో మేయర్గద్వాల విజయలక్ష్మి, ధూల్‌పేట పరిధిలోని బోయిగూడ బంగారు మైసమ్మ ఆలయంలో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, సికింద్రాబాద్‌లోని చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో చేనేత, జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
దేవాలయాల అభివృద్ధికి 1,290 కోట్లు ఇచ్చాం: భట్టి
దేవాలయాల అభివృద్ధికి రూ.1,290 కోట్లు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్లు విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారిని కోరుకున్నానన్నారు. పాతబస్తీలోని ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. ఓల్డ్‌సిటీకి మెట్రో రాబోతున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పాడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని మొక్కుకున్నానని చెప్పారు.
2,500 పోలీసులతో బందోబస్తు..
బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహించారు. సున్నితమైన ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు.
ధూల్‌పేట వేడుకల్లో మంత్రి వివేక్..
ధూల్‌పేట్ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఆలయం నిర్మించి వందేండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంగళ రవీందర్, ఆలయ వ్యవస్థాపక ట్రస్టీ కంఠం సంజయ్ పటేల్ పాల్గొన్నారు.