పుస్తకాలు అందలే.. యూనిఫామ్స్​ ఇయ్యలే..

పుస్తకాలు అందలే.. యూనిఫామ్స్​ ఇయ్యలే..
  • ఉమ్మడి జిల్లాలో సర్కార్ బడి పిల్లలకు తప్పని తిప్పలు 
  • స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం 

సర్కారు స్కూళ్లు స్టార్ట్ చేసి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ స్టూడెంట్స్ కు పూర్తిస్థాయిలో బుక్స్, యూనిఫామ్స్​ అందలేదు. టీచర్లు పాఠాలు చెబుతున్నా పిల్లలను పుస్తకాల కొరత వేధిస్తోంది. చదువుల్లో వెనుకబడిపోతున్నారు. 

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : ఈఏడాది జూన్ 13న ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పార్ట్ వన్ పాఠ్యపుస్తకాలు దశలవారీగా పంపిణీ చేసినప్పటికీ కంప్లీట్​కాలేదు. మెదక్​ జిల్లాలో 40 శాతం, సంగారెడ్డి జిల్లాలో  28 శాతం, సిద్దిపేట జిల్లాలో 15 శాతం పుస్తకాలు ఇంకా పంపిణీ కాలేదు. స్కూల్ యూనిఫామ్స్​ రెండు జతలు ఇప్పటికే అందాల్సి ఉండగా, సిద్దిపేట 18 వేల జతలు తప్ప సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఒక్క జత కూడా ఇవ్వలేదు. కాగా, ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేందుకు ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ ను ముద్రించారు. ఇంగ్లీష్ లోకి మార్చిన పుస్తకాలు లేకపోవడంతో తెలుగులోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా టెక్స్ట్ బుక్స్ లేకపోవడంతో ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మౌలిక, భాషా గణిత సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రవేశ పెట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో లెసన్ ప్లాన్ తయారీకి ఇబ్బంది అవుతోందని టీచర్లు అంటున్నారు. 

జిల్లాలవారీగా పరిస్థితి.. 

 సంగారెడ్డి జిల్లాలో 1,237 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. 1,24,356 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వీరందరికీ 8.50 లక్షల టెక్స్ట్ బుక్స్ అందాల్సి ఉండగా,  ఇంకా 28 శాతం అందాల్సి ఉంది. ఇప్పటి వరకు యూనిఫామ్స్​​కు సంబంధించి ఎంఈవో ఆఫీసులకు ఒకే జతకు క్లాత్​ ఇచ్చారు. అది కూడా మండల కేంద్రాల్లోని స్కూళ్లకు మాత్రమే. ఈ ఒక్క జత కూడా కుట్టడం పూర్తి కాక ఇంకా స్టూడెంట్స్ కు అందలేదు. 
 మెదక్ జిల్లాలో మొత్తం 943 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1.26 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 6.90 లక్షల టెక్స్ట్ బుక్స్ అవసరం. కానీ ఇంకా 40 శాతం బుక్స్ ఇవ్వాల్సి ఉంది. వచ్చిన బుక్స్ కూడా అన్ని సబ్జెక్ట్ లకు సంబంధించినవి సరఫరా కాలేదు. స్టూడెంట్స్ కు యూనిఫామ్స్​ ఇంకా అందలేదు. కొన్ని స్కూళ్లలో 1 నుంచి 8 తరగతుల స్టూడెంట్స్ కు, మరికొన్ని స్కూళ్లలో 9,10 తరగతుల స్టూడెంట్స్ కు సంబంధించి ఒక జతకు క్లాత్ సప్లై అయ్యింది. ఈనెల మొదటి వారంలోనే యూనిఫామ్స్​ అందజేస్తామని విద్యా శాఖ అధికారులు చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు. 
 సిద్దిపేట జిల్లాలో 1,014 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. 90 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంకా 15 శాతం పుస్తకాలు  పంపిణీ కావాల్సి ఉంది. యూనిఫామ్ క్లాత్ వచ్చినా వాటిని కుట్టించి అందజేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు కుట్టిన 18 వేల యూనిఫామ్స్ ను ఒక జత కింద మాత్రమే విద్యార్థులకు అందజేశారు. యూనిఫామ్ క్లాత్ ఆలస్యంగా రావడంతో పంపిణీలో లేటు అవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్స్ అందేందుకు మరో రెండు నెలలు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్స్​ త్వరగా అందజేసేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, యూనియన్ల నాయకులు కోరుతున్నారు.