మా ఆయన జ్ఞాపకాలతో పుస్తకం రాయడం తప్పా?

మా ఆయన జ్ఞాపకాలతో పుస్తకం రాయడం తప్పా?
  • పోలీసులు తీసుకెళ్లిన పుస్తకాలు తిరిగివ్వాలి
  • మావోయిస్టు ఆర్కే సతీమణి శిరీష

హైదరాబాద్: ఎవరైనా చనిపోయిన తర్వాత సంస్మరణ సభ జరుపుకుంటారు.. నేను కూడా అలాగే సంస్మరణ సభ నిర్వహించాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష ఆరోపించారు. ఆదివారం ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్కే సతీమణి శిరీష మాట్లాడుతూ 2004లో ఆర్కే చర్చలకు వచ్చినపుడు మీడియాలో వచ్చిన కథనాలు, ఫోటోలు జ్ఞాపకాలు దాచుకున్నానని, అలాగే 2010లో తాను అరెస్ట్ అయినపుడు నాపై వచ్చిన ఆరోపణలు కథనాలు కూడా దాచుకున్నానని వివరించారు. ఆ జ్ఞాపకాలన్నీ కలిపి నేను పుస్తకం రాయాలని భావించాను, కానీ రెండురోజుల క్రితం ప్రింటింగ్ ప్రెస్ పై దాడులు చేసి పోలీసులు పుస్తకాలన్నీ ఎత్తుకెళ్లారని ఆమె ఆరోపించారు. పోలీసులు తీసుకెళ్లిన పుస్తకాన్ని తిరిగి ఇవ్వాలని, పుస్తక ఆవిష్కరణకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు. సమావేశంలో సామాజిక వేత్త, హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.