జిల్లా చరిత్రలతో పుస్తకాలు

జిల్లా చరిత్రలతో పుస్తకాలు
  • అన్ని ముచ్చట్లకు చోటు కల్పించేలా ప్రణాళిక
  • జిల్లాల వారీగా‌ ఎక్స్​పర్ట్స్ కమిటీల ఏర్పాటు
  • భవిష్యత్​ తరాల కోసమే అంటున్న సారస్వత పరిషత్

హైదరాబాద్, వెలుగు: ‘మన సాంఘిక చరిత్ర అంటే మన చరిత్రే.. మనం కూడా చరిత్రకెక్కదగిన వారమే’ అని తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి చెప్పిన ముచ్చటను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ సారస్వత పరిషత్ క్షేత్ర స్థాయిలో చరిత్ర రచనకు శ్రీకారం చుట్టింది. జిల్లాలవారీగా చరిత్రను రాయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. జిల్లాల సమాచారం భౌగోళికంగానేగాక సంస్కృతి, సాహిత్యం, కళలకు సంబంధించిన అన్ని విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావాలని ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల సమగ్ర చరిత్ర పుస్తకాలు తుది దశలో ఉండగా, మిగతా30 జిల్లాల చరిత్ర రచన కొనసాగుతోంది. పుస్తకం ప్రింట్​ కాగానే ఆయా జిల్లా కేంద్రాల్లో సాహిత్య, సాంస్కృతికోత్సవాలు నిర్వహించి విడుదల చేయనున్నారు. 

సమగ్ర సమాచారం ఉండేలా..
గతంలో 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లాలు అస్తిత్వం కోల్పోయి.. చిన్న జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. ప్రతి జిల్లా నైసర్గిక స్వరూపం మారిపోయింది. అయినా ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల నైసర్గిక స్వరూపం, అందులోని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల పేర్లు జిల్లా ప్రాచీన, ఆధునిక చరిత్ర, సంస్కృతి, పురావస్తు కట్టడాలు, కళల వికాసం, పద్య, గేయ, వచన కవిత్వం, కథ, నవల, విమర్శ, అనువాదం, పరిశోధన, బాల సాహిత్యం, పత్రికలు, జానపద కళలు, తెలంగాణ ఉద్యమంలో జిల్లా కళాకారులు, కవులు, రచయితల పాత్ర, విద్యారంగం, పరిశ్రమలు, వ్యవసాయం, సాగు, తాగునీటి పథకాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రాచీన ఆలయాలు, జాతరలు, జానపద విజ్ఞానం, జిల్లాకు చెందిన సంస్థలు, ప్రముఖ పండితులు, స్వాతంత్ర్య సమరయోధులు, కళాకారులు, క్రీడారంగానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా చరిత్ర పుస్తకాల్లో పొందుపరుస్తున్నారు.

జిల్లాకో కమిటీ
చరిత్ర రచనకు ప్రతి జిల్లాలో ఒక కన్వీనర్‌, మరికొందరు సభ్యులతో కోర్‌కమిటీలను సారస్వత పరిషత్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 23 జిల్లాల కమిటీల ఏర్పాటు పూర్తి కాగా మరో 10 జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వివిధ అంశాలపై వ్యాసాలు రాసే ఎక్స్​ పర్ట్స్​ ను ఈ కమిటీలు ఎంపిక చేస్తాయి. అలాగే జిల్లాలోని అన్ని ప్రాంతాల వారికీ చరిత్ర రచనలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఒక్కో అంశంపై సమగ్ర సమాచారంతో ఒక్కో రచయిత చేతి రాతలో అయితే 10 పేజీలకు మించకుండా, టైప్​ లో 6 పేజీలకు మించకుండా వ్యాసాన్ని పూర్తి చేయాలని నిబంధన విధించింది. ప్రతి వ్యాసంలో రిఫరెన్స్​ బుక్స్​ వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది.

భవిష్యత్ తరాలకు రిఫరెన్స్​ గా..
ఇప్పటి వరకు జిల్లాల సమగ్ర స్వరూపంతో కూడిన పుస్తకాలు అందుబాటులో లేవు. ఎప్పటికప్పుడు చరిత్రను, వర్తమానాన్ని రికార్డు చేస్తేనే భవిష్యత్ తరాలకు చరిత్ర ఏమిటో తెలుస్తుంది. అందుకే సారస్వత పరిషత్​ జిల్లాల చరిత్ర రచనకు పూనుకుంది. ఇందులో వ్యాసాలు సమగ్రంగా, ప్రామాణికంగా, నిష్పాక్షికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నం.
– డాక్టర్​ జె.చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్