కుట్రలెవరివి? TRSలో బయటపడ్డ విభేదాలు

కుట్రలెవరివి? TRSలో బయటపడ్డ విభేదాలు

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ బాంబు పేల్చారు. తన ఓటమికి కుట్రలే కారణమన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు పరాభవం ఎదురైందన్నారు. కారకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్​ నమ్మకాన్ని నిలబెట్టడంలో ఫెయిల్​ అయ్యామని ఆవేదన చెందారు. భువనగిరి పార్లమెంట్​ పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాను.. అయినా సప్త సముద్రాలు దాటి కాల్వలో పడి చచ్చినట్లు రోడ్​ రోలర్​ ఢీకొట్టి ఓడానన్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలున్నట్లు తన పరిస్థితి ఉందని, ఎవరినీ నిందించనంటూనే తన మనసులోని మాట చెప్పారు.. ఇదంతా ఏ నలుగురు కార్యకర్తలతోనో.. పార్టీ అంతర్గత సమావేశాల్లోనో  చెప్పిన ముచ్చట్లు కానే కాదు.. స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ కుండ బద్దలు కొట్టారు. ఎంపీగా ఓటమి తదుపరి భువనగిరి, జనగామలో బుధవారం పర్యటించిన ఆయన రెండుచోట్ల తన ఆవేదన వెళ్లగక్కారు. ఓడించినా ప్రజల మధ్యనే ఉంటానని తన శ్రేణుల్లో భరోసా నింపారు. ఇప్పుడీ ముచ్చట్లు టీఆర్ఎస్ వర్గాల్లో హాట్​టాపిక్ గా మారాయి. ఇటీవలి ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్​నుంచి సిట్టింగ్​ అభ్యర్థిగా బరిలో నిలిచిన బూర తన ప్రత్యర్థి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు గత నెల 23న వచ్చాయి. అప్పటి నుంచి బూర సైలెంట్​గా ఉన్నారు. ఇదే క్రమంలో బొమ్మల రామారం మండలంలోని ఇద్దరు ముఖ్యనేతలు, రెడ్డి, బీసీ సామాజిక వర్గాల మధ్య ఉన్న దూరం… బూరకు సహాయ నిరాకరణ వంటి వాయిస్​రికార్డ్​ వాట్సప్ గ్రూపులో రచ్చ చేసింది. కొన్నాళ్లకు అది సద్దుమణిగింది. కానీ తాజాగా మళ్లీ బూర నర్సయ్య తన ఓటమి కోసం నేతలు కుట్రలు చేశారని ఆరోపించడం గులాబీ శ్రేణులను షాక్​కు గురి చేసింది.

బయట పడ్డ విభేదాలు
బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్​ను రెడ్డి సామాజిక వర్గం నేతలు ఇక్కట్లకు గురి చేశారనే ప్రధాన ఆరోపణ సర్వత్రా నెలకొంది. భువనగిరి పార్లమెంట్​ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్​ వారే ఉన్నప్పటికీ ఓడిపోయారు. పార్టీలకు అతీతంగా రెడ్డి లాబీయింగ్​ జరగడం, రోడ్​రోలర్​గుర్తు కూడా కొంత కారణమని ఇంటలిజెన్స్​ నివేదికలు ప్రభుత్వానికి అందినట్లు వినికిడి. ఎమ్మెల్యేలు, బూర మధ్య అంతగా సఖ్యత లేకపోవడం కూడా ఓటమికి కారణంగా పేర్కొంటున్నారు. పైకి అంతా ఒక్కటిలా కనిపించినా.. సమన్వయలోపం ఉన్న విషయాన్ని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అప్పట్లోనే పసిగట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి సన్నాహక సభలో సుతిమెత్తని హెచ్చరికలు చేశారు. ఎవరికివారు తమ అసెంబ్లీ పరిధిలో లక్షల్లో మెజారిటీ ఇస్తామని అంటే.. అందరూ కలిపి లక్షకు పైగా ఇవ్వండని అన్నారు. అయినా ఎవరూ అంతగా పట్టించుకోలేదని ఫలితాలు రుజువు చేశాయి.