
- ప్రోత్సహించేందుకు రూ.1,345 కోట్ల విలువైన రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం
- ఆసక్తి చూపిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా, ఉనో మిండా, సోనా కామ్‌స్టార్ వంటి కంపెనీలు
న్యూఢిల్లీ: దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్ల (అయస్కాంతాల) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.1,345 కోట్లతో కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. రేర్ ఎర్త్ మెటల్స్ కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడేవాళ్లం. తాజాగా వీటి ఎగుమతులపై అక్కడి ప్రభుత్వం నియంత్రణలు పెట్టింది.
90శాతం గ్లోబల్ మాగ్నెట్ ఉత్పత్తిలో ఈ దేశ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి, ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికం, డిఫెన్స్ రంగాల సప్లయ్ చెయిన్‌ను బలోపేతం చేయడానికి కొత్త స్కీమ్ తీసుకొచ్చామని యూనియన్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం పేర్కొన్నారు. రేర్ ఎర్త్ మాగ్నెట్ స్కీమ్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లు సమీక్షకు వెళ్లాయని హెవీ ఇండస్ట్రీస్ సెక్రటరీ కమ్రాన్ రిజ్వీ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా తన 540 టన్నుల మాగ్నెట్లలో 80శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంది.
ఇండియా ప్రపంచంలో ఐదో అతిపెద్ద రేర్ ఎర్త్ రిజర్వ్‌లను (6.9 మిలియన్ టన్నులు) కలిగి ఉంది. చైనా 44 మిలియన్ టన్నులతో మొదటి స్థానంలో ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఉనో మిండా, సోనా కామ్‌స్టార్ వంటి కంపెనీలు దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్లను తయారు చేయడానికి ఆసక్తి చూపాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల విస్తరణ కోసం స్థానిక తయారీదారులతో భాగస్వామ్యం లేదా దీర్ఘకాల సరఫరా ఒప్పందాలకు సిద్ధంగా ఉంది. ఉనో మిండా (మారుతి సుజుకి సరఫరాదారు), సోనా కామ్‌స్టార్ (ఫోర్డ్, స్టెల్లాంటిస్‌కు సరఫరాదారు) కూడా ఆసక్తి చూపాయి.
తాజా స్కీమ్ కింద అర్హత పొందాలంటే స్థానికంగా సేకరించిన ముడిసరుకు (50శాతం నుంచి 80శాతం వరకు) వినియోగించాలని ప్రభుత్వం షరతుగా పెట్టింది. 500–-1,500 టన్నుల వార్షిక ఉత్పత్తికి బిడ్స్ ఆహ్వానిస్తోంది. ఈ స్కీమ్ ప్రైవేట్, పబ్లిక్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. అయితే రా మెటీరియల్స్ దొరకడం, ప్రోత్సాహకాలు ఇచ్చే విధానం బట్టి కంపెనీల పెట్టుబడి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని ఎనలిస్టులు చెబుతున్నారు.