
తెలంగాణ కాంగ్రెస్ లో మూడుముక్కలాట : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
సూర్యాపేట. వెలుగు : తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అని మూడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 25మంది కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పోస్ట్ పెయిడ్ గా వాడుకుంటే, ఇప్పుడు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నాయకులతో పాదయాత్రలు చేయించి, అనుకున్న వారికి టికెట్లు ఇప్పించి, ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి ప్రీ పెయిడ్ గా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ నాయకులు వీసా ఇవ్వనిదే జిల్లాలో కాలు అడుగు పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని అన్నారు. రాష్టంలో అవినీతి, అహంకార, అరాచక, ఆ దిపత్య పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్రు..
జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు ల్యాండ్ , సాండ్ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ఎవరైనా అడ్డొస్తే వారిని హత్య చేయించి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. సూర్యాపేట పట్టణంలోని వజ్రా టౌన్ షిప్ కు డీటీపీసీ లేఔట్ పర్మిషన్ లేదని, అయినా ఉన్నట్టుగా నమ్మించి ప్రజలను మోసం చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేటలో గిరిజన యువకుడిని హత్య చేస్తే ఇప్పటివరకు నిందితుడిని గుర్తించలేదన్నారు. తుంగతుర్తి లో రూ.7కోట్ల ఆస్తి కోసం అంజయ్య అనే వ్యక్తిని హత్య చేశారని, ఇందులో ఎమ్మెల్యే అనుచరుడు, మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడి పాత్ర ఉందని ఆరోపించారు. ఈ రెండు కేసులను సీబీఐకి అప్పగించి అసలు నిందితులను గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, సూర్యాపేట అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, బీజేపీ రాష్ట్ర నాయకులు తుక్కాని మన్మాద రెడ్డి, బూర మల్సూర్ గౌడ్, జిల్లా నాయకులు చలమల నర్సింహా, సలిగంటి వీరేంద్ర, మీర్ అక్బర్, వల్దాస్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.