ఇయ్యాల్టి నుంచి బూస్టర్ డోస్

ఇయ్యాల్టి నుంచి బూస్టర్ డోస్
  • హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, రోగాలున్న వృద్ధులకు టీకా 
  • ఇంతకుముందు వేస్కున్న వ్యాక్సినే వేస్తరు 
  • రెండు, మూడో డోసుకు మధ్య 9 నెలల గ్యాప్ మస్ట్ 

హైదరాబాద్, వెలుగు: హెల్త్ కేర్, ఫ్రంట్‌‌లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వృద్ధులకు సోమవారం నుంచి కరోనా టీకా బూస్టర్ డోస్(ప్రికాషనరీ) వేయనున్నారు. హైదరాబాద్ చార్మినార్‌‌‌‌ వద్ద ఉన్న ప్రభుత్వ యునానీ హాస్పిటల్‌‌లో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌రావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో బూస్టర్ డోసు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్‌‌ లైన్ వర్కర్లు కలిపి 6.34 లక్షల మంది ఉన్నారు. 60 ఏండ్లు దాటినోళ్లు 41.6  లక్షల మంది ఉండగా, వారిలో 20 శాతం మంది వివిధ రోగాలతో బాధపడుతున్నట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ అంచనా వేసింది. కాగా, వ్యాక్సినేషన్‌‌కు సంబంధించిన గైడ్‌‌లైన్స్‌‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసింది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే, మూడో డోసు కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. రెండో డోసు తీసుకొని 9 నెలలు(39 వారాలు) పూర్తయిన వారికి మాత్రమే బూస్టర్ డోసు ఇవ్వాలని సూచించింది. 
వృద్ధులకు మాత్రం ఫిబ్రవరిలోనే... 
రాష్ట్రంలో హెల్త్ కేర్ వర్కర్లకు పోయినేడాది జనవరి 15న ఫస్ట్‌‌ డోసు వ్యాక్సినేషన్ మొదలైంది. మొదట్లో వ్యాక్సిన్ వేసుకున్నోళ్లు, ఫిబ్రవరి చివరిలో సెకండ్ డోసు తీసుకున్నారు. ఫ్రంట్‌‌లైన్ వర్కర్లకు ఫిబ్రవరిలో ఫస్ట్ డోసు, మార్చి చివరి నుంచి సెకండ్ డోసు ప్రారంభమైంది. ఫిబ్రవరి, మార్చిలో సెకండ్ డోసు తీసుకున్న హెల్త్ కేర్‌‌‌‌ వర్కర్లు, మార్చిలో సెకండ్ డోసు తీసుకున్న ఫ్రంట్‌‌లైన్ వర్కర్లకు మాత్రమే 9 నెలల గడువు పూర్తయింది. ఇప్పుడు బూస్టర్ డోసు తీసుకోవడానికి వీళ్లు మాత్రమే అర్హులు. వృద్ధులకు పోయినేడాది మార్చి ఫస్ట్ నుంచి ఫస్ట్ డోస్, ఏప్రిల్ థర్డ్‌‌ వీక్ నుంచి సెకండ్ డోస్ ప్రారంభమైంది. రెండో డోసుకు, మూడో డోసుకు మధ్య 9 నెలల గ్యాప్ ఉండాలంటే... ఏప్రిల్‌‌లో సెకండ్ డోసు తీసుకున్న వృద్ధులు మూడో డోసు తీసుకోవడానికి ఫిబ్రవరిలో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అందువల్ల ఇప్పుడు హెల్త్ కేర్, ఫ్రంట్‌‌లైన్‌‌ వర్కర్లకు మాత్రమే బూస్టర్ డోసు ఇవ్వాల్సి ఉంటుంది.