భగీరథ పైప్‌లైన్‌పై బోర్‌

భగీరథ పైప్‌లైన్‌పై బోర్‌
  • మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్ ను ముంచెత్తింది
  • పలువురు స్టూడెంట్లకు గాయాలు
  • ప్రైవేటు ఫంక్షన్ హాల్ కు పిల్లల తరలింపు

రెసిడెన్సియల్‌ స్కూల్లో నీటి సమస్య తీర్చేందుకు బోర్‌ వేస్తుంటే డ్రిల్లర్‌ హ్యామర్‌ ‘భగీరథ’ పైప్‌లైన్‌కు తగిలి ఉవ్వెత్తున 50 ఫీట్ల ఎత్తుతో నీళ్లు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా రూమ్స్‌ను ముంచెత్తాయి. పిల్లలు భయంతో పరుగులు పెట్టారు. పలువురు గాయపడ్డారు.  జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఓ కిరాయి బిల్డింగ్‌లో మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్‌ నడుస్తోంది. ఇందులో 280 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రిన్సిపల్‌.. స్కూల్లో నీటి సమస్యను బిల్డింగ్ ఓనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్ గేట్ ముందు కొత్త బోర్ వేయడానికి ఓనర్‌ పాయింట్ చూశారు. బుధవార బోర్‌బండి తీసుకొచ్చారు. వీరు చూసిన పాయింట్‌ కిందే మూడు నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘మిషన్ భగీరథ’ పైప్‌లైన్ ఉంది. ఇది గమనించని బిల్డింగ్ ఓనర్‌, బోర్‌ బండి వారు రాత్రి 8 గంటలకు బోరు వేయడం ప్రారంభించారు. ఆ టైమ్‌కు పిల్లలు భోజనం చేసేందుకు డైనింగ్‌హాల్లో కూర్చున్నారు. బోర్ వేయడం స్టార్ట్‌ చేయగానే డ్రిల్లింగ్‌ హ్యామర్‌ భగీరథ పైప్‌లైన్‌కు తగిలింది. ఒక్కసారిగా పెద్ద సప్పుడుతో పైప్‌లైన్‌ పగిలిపోయి నీళ్లు ఉవ్వెత్తున 50 ఫీట్లకు పైగా ఎగసిపడ్డాయి.  డైనింగ్ హాల్‌, బిల్డింగ్‌ నాలుగు ఫ్లోర్లలోని పిల్లల రూమ్‌లను ముంచెత్తాయి. ఏం జరుగుతుందో తెలియక పిల్లలు భయంలో పరుగులు పెట్టారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ మల్లారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఘటనాస్థలానికి వెళ్లి పిల్లల్ని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌కు తరలించి భోజన ఏర్పాట్లు చేశారు. సంబంధిత డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లతో మాట్లాడి నీటి సరఫరాను ఆపివేయించారు. విషయం తెలియగానే స్టూడెంట్ల పేరెంట్స్ ఫంక్షన్ హాల్‌కు పరిగెత్తుకు వచ్చారు. స్కూల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ రాజేశం ఘటనాస్థలాన్ని పరిశీలించి బిల్డింగ్ ఓనర్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. గాయపడిన పిల్లల్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.