
- ఫుడ్, నీళ్లు, బాత్రూమ్ ల్లేవ్!
- కాలినడకన కలెక్టరేట్ కు స్టూడెంట్లు
- మధ్యలో అడ్డుకుని వెనక్కి పంపించిన పోలీసులు
- స్కూల్ కు వెళ్లి విచారణ చేసిన అడిషనల్ కలెక్టర్
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతి రావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో సౌలతులు లేవని స్టూడెంట్స్ బుధవారం రోడ్డెక్కారు. ఉదయం కాలినడకన కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్లారు. పదో తరగతి స్టూడెంట్స్ దాదాపు 59 మంది కలెక్టరేట్ వెళ్తున్నట్టు తెలియడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు.
ఉండవల్లి మండలం ఇటిక్యాల పాడు స్టేజి సమీపంలో నేషనల్ హైవే పై అడ్డుకున్నారు. సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని నచ్చజెప్పి డీసీఎంలో హాస్టల్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు స్టూడెంట్స్ మాట్లాడుతూ.. పాఠశాలలో 570 మంది స్టూడెంట్స్ ఉంటున్నామన్నారు. ఫుడ్, నీళ్లతో పాటు సరిపడా బాత్రూమ్స్ లేవన్నారు. సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి బోరు నీరు మాత్రమే ఉందని, మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ అయిందన్నారు.
టీచర్లు, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. పురుగుల అన్నం పెడుతున్నారని టీచర్ల దృష్టికి తీసుకెళ్తే ‘ మీ కడుపులో కూడా ఎన్నో పురుగులు ఉన్నాయి’ అంటూ హేళనగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బాత్రూం కూడా సరిగా లేకపోవడంతో టాయిలెట్ కు వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాల్సి వస్తుందన్నారు. భూముల యజమానులు కూడా రానివ్వడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్టూడెంట్స్ వాపోయారు.
కాగా.. సమాచారం అందిన వెంటనే అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు స్కూల్ కి వెళ్లి, స్టూడెంట్ల సమస్యలపై ఎంక్వయిరీ చేస్తుండగా, అక్కడే వారితో పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. వంట సామగ్రిని ఒక బండిపై వేసుకొని తోస్తు కిచెన్ వరకు స్టూడెంట్స్ తీసుకెళ్లారు.
గురుకుల స్కూల్లోని సమస్యలను పరిష్కరిస్తామని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే విజయుడు కూడా స్కూలుకు చేరుకొని స్టూడెంట్ల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేయాలని ఆఫీసర్లకు సూచించారు.