
- బదిలీలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఎక్స్‌గ్రేషియా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంపు, ఉపాధి కూలీల హాజరు నమోదు కోసం ఫీల్డ్ అసిస్టెంట్లకు మొబైల్ ఫోన్ల మంజూరు వంటి అంశాలను కేబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో మంత్రి సీతక్క బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలను వినిపించగా, మంత్రి స్పందించారు.
సర్క్యులర్ 4,779 రద్దు చేయాలని అధికారులకు సూచించారు. దీని ద్వారా గత ప్రభుత్వంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల పునర్‌నియామకం సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీలకు అనుమతి ఇవ్వాలని, వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకే జీతం ఇవ్వాలని సూచించారు. మండల ఆఫీస్‌లలో ఉపాధి హామీ విభాగంలో పనిచేస్తున్న 540 మంది ఎంసీసీ అటెండర్ల జీతాలను వారి విజ్ఞప్తి మేరకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని మంత్రి ఆదేశించారు. కాగా, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సీతక్క చొరవ చూపడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రిని సన్మానించారు.
మానవ అక్రమ రవాణా అరికడదాం
సమిష్టి పోరాటాలతోనే మానవ అక్రమ రవాణా భూతాన్ని అంతం చేయొచ్చని మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సీ భవనంలో ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణాపై పోరాడుతున్న పలువురు ప్రముఖులను సన్మానించారు.
ప్రజ్వల ఫౌండేషన్ చైర్మన్ సునీత కృష్ణన్ కు అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను నిరోధించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. మహిళల శరీరాలతో వ్యాపారం చేసే దుర్మార్గులు సమాజంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.