
ఎవరు అవునన్నా కాదన్నా ఆపరేషన్ సిందూర్ మూడురోజుల యుద్ధంలో భారత్ పైచేయి సాధించిన మాట నిజం. మరో రెండు రోజులు యుద్ధం కొనసాగితే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తుందని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ భావించాడు. పాక్ నిత్య తీవ్రవాదానికి ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. వీలైతే పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశమూ ఉండొచ్చని అనుకున్నారు. కానీ, మే 9 రాత్రి ఏంజరిగిందో కానీ, మే 10న ట్రంప్ ట్వీట్ దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడే కాల్పుల విరమణను ప్రకటించేశాడు. దాంతో దేశం నివ్వెరపోయిన మాట నిజం. 26 మందిని మతాధారంగా కాల్చిచంపిన మతోన్మాద దుర్మార్గం అది. దేశ ప్రజలు ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఆపరేషన్ సిందూర్‌తో ఒక పరిష్కారం దొరుకుతుందని దేశ ప్రజలంతా ఆశించిన మాటను ఎవరూ కాదనలేరు. ప్రజలు ఫలితం ఆశిస్తారు తప్ప రాజకీయాలను కాదు.
మొత్తం మీద రెండున్నర నెలల తర్వాత
పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరిగింది. వాదోపవాదాలు మాత్రం తగ్గేదేలే అన్నట్లు జరిగాయి. వాస్తవం చెప్పాలంటే, అధికార, ప్రతిపక్షాలు బ్లేమ్ గేమ్‌కే అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. ఆపరేషన్ సిందూర్ ఆకస్మికంగా విరమించిన తీరుపై దేశ ప్రజల్లో ఏర్పడిన అసహనాన్ని ప్రతిపక్షం అస్త్రంగా మలుచుకుందనడంలో సందేహం లేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అదే చేస్తారు కూడా. అలాగే ‘నేషన్ ఫస్ట్’ అని చెప్పుకునే పార్టీ ట్రంప్ చెప్పిన సీజ్ ఫైర్‌ను ఎందుకు అమలు చేసింది అనే ప్రశ్న ప్రతిపక్షానిది మాత్రమే కాదు.. ఈ దేశ కోట్లాది ప్రజలది కూడా అనే విషయం కేంద్ర పెద్దలకూ తెలియంది కాదు. దానికి ప్రధాని తనకు తానుగా దేశానికి ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు అనే నైతిక ప్రశ్నలు ప్రతిపక్షాలు రాజకీయం కోసం వేయొచ్చు, కానీ సంఘ్‌పరివార్ కార్యకర్తల్లోనూ లోలోపల ఆ ప్రశ్నలు ఉన్నాయనే విషయం కాదనలేనిది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అడగడాన్ని రాజకీయంగా వ్యతిరేకించే బీజేపీ కార్యకర్తలు ఉండొచ్చు. కానీ అంతర్గంతగా పై ప్రశ్నలు అందరిలోనూ ఉన్నవే.
ప్రధాని వివరణ
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంలో ప్రజల్లో ఉన్న సందేహాలకు జవాబులు దొరికాయా అంటే, దొరికీ దొరకనట్లుగా ఉన్నాయనేది సర్వవ్యాప్త అభిప్రాయం .
‘యుద్ధం ఆపాలని ఏ దేశనాయకుడూ చెప్పలేదు. మొదట పాక్ డిఫెన్స్ వర్గాల నుంచి కాల్పుల విరమణచేద్దామని వినతి వచ్చింది. ఆ తదుపరి రోజు పాక్‌లోని డిఫెన్స్ స్టేషన్లను భారీ ఎత్తున ధ్వంసం చేశాం. 9 తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు నాలుగు సార్లు ఫోన్ చేసినా.. సైనికాధికారుల సమావేశంలో బిజీగా ఉండడం వల్ల కాల్ రిసీవ్ చేసుకోలేదు. తదుపరి నేనే ఆయనకు మళ్లీ రీకాల్ చేశాను. ఆయన చెప్పిందేమిటంటే, పాకిస్తాన్ భారీ ఎత్తున దాడి చేయబోతున్నదన్నారు. దానికి నేను చెప్పిన జవాబు ఏమిటంటే.. పాకిస్తాన్ గోలీకా జవాబ్ కో హమ్ గోలా సే దేంగే అని చెప్పిన’ అని ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ కొత్తగా చెప్పిందేమిటి? అనేది సహజంగా ఎవరికైనా అనిపించింది. ఆపరేషన్ సిందూర్‌పై మరిన్ని వాస్తవాలు ప్రభుత్వం వెల్లడించవచ్చు అని మాత్రం అందరూ ఊహించారు. ట్రంప్ జోక్యం లేదని, అలాగే పాకిస్తాన్ పీచమణిచామని, కాల్పుల విరమణ ప్రస్తావన పాకిస్తాన్ డిఫెన్స్ వర్గాల నుంచే వచ్చిందని.. క్లుప్తంగా ప్రధాని మోదీ ప్రసంగంలో లభించిన వివరణ అది. వాస్తవానికి ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో జరిగింది క్రిటికల్ డిబేట్. అదేమీ కాంగ్రెస్, బీజేపీల రాజకీయాల కోసం జరిగిన డిబేట్ కాదు. కానీ జరిగిందంతా రాజకీయ డిబేట్లాగానే ఉండడం దేశ ప్రజలను బాగా నిరాశ పరిచిందని చెప్పాలి.
మూడ్ ఆఫ్ ది నేషన్
‘బస్ కరో హమ్కో బహుత్ మారే’ అంటూ పాకిస్తాన్ లొంగిపోయి కాల్పుల విరమణ ప్రస్తావన తెచ్చిందని ప్రధాని చెప్పారు. కానీ, దాన్ని ఎలా అంగీకరించారనేదే కదా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ వేస్తున్న ప్రశ్న. ఇకపై తీవ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషించబోమని హామీ ఇచ్చిందా? అలా ఇచ్చి ఉంటే ఇరు దేశాల మధ్య కనీసం ఒప్పందం జరిగిందా? ఒకవేళ జరిగితే పాక్ కాల్పుల విరమణ ప్రస్తావనను అంగీకరించి ఉండాలి! అలాంటిదేమీ లేకుండా పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఎలా అంగీకరించినట్లు? మోదీ ప్రసంగంలో ఈ ప్రశ్నకు ఎక్కడా జవాబు కనిపించలేదు. షరతులు లేని కాల్పుల విరమణ వల్ల, రేపు మరోసారి తీవ్రవాదుల దాడులు జరిగితే బాధ్యులెవరు? మరోసారి ఆపరేషన్ సిందూర్ జరపడం, దానిపై ట్రంప్ మరోసారి కాల్పుల విరమణ ప్రకటించి నోబెల్ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేయడం తప్ప ఈ దేశానికి తీవ్రవాదుల బెడద తప్పే పరిస్థితి ఉన్నదా?
31వ ట్రంప్ కామెంట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నేను కోరుకోవడంతోనే భారత్ యుద్ధం ఆపింది’ అని 31వసారి ప్రకటించడం చూస్తే.. ట్రంప్ భారత్ వెంట పడ్డాడేమిటనేది అని ప్రతి భారతీయుడికీ అర్థంకాని ప్రశ్నగామారింది. అదేరోజు పార్లమెంటులో ప్రధాని మాట్లడటం, అదేరోజు ట్రంప్ 31వసారి తానే యుద్దం ఆపానని ప్రకటించడం యాదృచ్ఛికంగా జరిగిందేనా? ఇది మన వ్యూహాత్మక దౌత్యనీతికి ప్రశ్నగా మారింది!
కర్తవ్యం ముఖ్యం
ఇంతకీ, మోదీ చెప్పినట్లు పాకిస్తాన్ దిగిరావడంతో యుద్ధం ఆగిందా? లేక, ట్రంప్ జోక్యంతో ఆగిందా అనేది ఇప్పటికీ అర్థంకాని విషయమే! అలాగే, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో, తీవ్రవాద బాధిత భారత్‌ను జత కట్టి కాల్పుల విరమణ నేనే చేయించానని చెప్పడం, అమెరికా అధర్మనీతి మనకు ఒక చేదు అనుభవం! ఈ చేదు అనుభవాన్ని ఛేదించడమే మన ప్రధాని మోదీ ముందున్న కర్తవ్యం. ఆ తర్వాతే ప్రతిపక్షాలను నిందించడమైనా, మరేదైనా!
కొన్ని బహిరంగ పర్చడం సాధ్యం కాకపోవచ్చు!
కారణం ఏదైనా కావచ్చు, ప్రధాని మోదీ ఇప్పటికీ ‘యుద్ధం ఆపాలని ఏదేశ నేత నాకు చెప్పలేదు’ అని అంటున్నారు తప్ప, ట్రంప్ పేరును మాత్రం ప్రస్తావించి చెప్పడం లేదు. ఇదే విషయంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని పదే పదే ప్రశ్నిస్తున్నారు. నిజానికి, దేశానికి సంబంధించిన కొన్ని విషయాలు బహింరగపర్చడం సాధ్యం కాకపోవచ్చు. అలా ప్రకటిస్తే దేశ ప్రయోజనాలకు నష్టం జరిగే అవకాశమూ ఉండొచ్చు. అమెరికాతో మనకున్న అనేక సంబంధాలు అందుకు అడ్డుగా మారుతున్నాయేమో తెలియదు. ఆ విషయం ప్రధాని మోదీకి మాత్రమే తెలుసుకావచ్చు!
ట్రంప్ నోబెల్ ఆశకు కలిసిరాలేదనా?
‘యుద్ధం ఆపాలని నాకు ఏ దేశ నేత చెప్పలేదు’ అనే ప్రధాని మాట ఎక్కడికి దారితీసిందో గమనించొచ్చు. నిన్ననే భారత్‌పై 25 శాతం అమెరికా టారిఫ్ విధించింది. అంటే, పార్లమెంటులో యుద్ధ విరమణ ట్రంప్ చేయించాడని మన ప్రధాని చెప్పిఉంటే, ట్రేడ్ టారిఫ్ అంతగా విధించేవాడు కాదేమో! అలా చెప్పి ఉంటే ట్రంప్ ఆశిస్తున్న నోబెల్ బహుమతికి ఆయనకు కలిసొచ్చేదేమో? జాతి భద్రత అనేది రాజకీయాలకు అతీతమైనది. ఈ విషయాన్ని అధికార, ప్రతిపక్షాలు అర్థం చేసుకోకుంటే ఈ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఓట్ల కోసం మాత్రమే మాట్లాడతామంటే, ఈ దేశం తీవ్రవాద ముప్పులకు, ట్రంప్‌లాంటి వారి ఆటలకు గురి అవుతూనే ఉంటుంది. దేశం ప్రధానం, ఆ తర్వాతే రాజకీయాలనేది అన్ని పార్టీలూ గుర్తుంచుకోవాలె. ముఖ్యంగా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అని ఎప్పుడూ చెప్పే బీజేపీ మరీ గుర్తుంచుకోవాలె!
మొత్తం మీద ఆపరేషన్ సిందూర్‌ను అకస్మాత్తుగా ఆపేయడం, ప్రజలకు కారణాలు అర్థం కాకపోవడం, అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారడం సహజ పరిణామం. కాబట్టి ప్రధాని మోదీ ప్రసంగం ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి మాత్రమే పరిమితమైతే బాగుండేది. చాలామేరకు గత ప్రభుత్వాల చరిత్రను వినిపించడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. అంతర్జాతీయంగా మంచి పేరు, దేశంలో మంచి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్‌ను అనూహ్యంగా ఆపేస్తాడని ఈ దేశంలో ఎవరూ ఊహించలేదు. అందుకు ఏర్పడ్డ కారణాలేమిటి అని మోదీ దేశ ప్రజలకు వివరించి ఉంటే ప్రతిపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంటులో చర్చించాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో?
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్