
రష్యాలో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో కుదిపేసింది. పెట్రోపావ్లోవ్స్క్- కమ్చట్స్కీ నుంచి119 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం 20.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. ఈ శక్తివంతమైన భూకంపంతో యునైటెడ్ స్టేట్స్, జపాన్, చిలీ ,న్యూజిలాండ్‌తో సహా పలు దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో హల్ చల్ చేస్తోంది. నెట్టింట చర్చకు దారితీసింది. రష్యాలోని కమ్చట్కాలో బెలూగా తిమింగలాల గుంపు ఒడ్డుకు కొట్టుకు రావడం ఇటీవల సంభవించిన భూకంపానికి హెచ్చరిక సంకేతంగా ఉండవచ్చని చాలామంది అనుకుంటున్నారు. దీనిపై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి.
ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక చిన్న తిమింగలంతో సహా ఐదు బెలూగా తిమింగలాలు కమ్చట్కా ఒడ్డున చిక్కుకుపోయినట్లు కనిపిస్తుంది. తిమింగలాలు నిస్సార నీటిలోకి ప్రవేశించి, అలలు తగ్గుముఖం పట్టడంతో ఈత కొట్టలేకపోయాయని, ఫలితంగా అవి తీరప్రాంతానికి చేరాయని తెలుస్తోంది. ఈ క్లిప్‌లో మత్స్యకారుల బృందం తిమింగలాలను సముద్రపు నీటితో తేమగా ఉంచడం ,అధిక అలలు తిరిగి వచ్చినప్పుడు సముద్రంలోకి తిరిగి ఈదడానికి సహాయం చేయడం కనిపిస్తోంది.
కమ్చట్కాలో భారీ భూకంపం రావడానికి ఒక రోజు ముందు ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. కొంతమంది వినియోగదారులు తిమింగలం ఒడ్డుకు చేరిన ప్రదేశం భూకంప కేంద్రం దగ్గర ఉందని అంటున్నారు. ఇది విపత్తు సంభవించే ముందు జంతువులు దానిని పసిగట్టాయా అనే దానిపై చర్చకు దారితీసింది.
ఈ సంఘటనపై చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బెలూగాల అసాధారణ ప్రవర్తన రాబోయే విపత్తుకు సంకేతం లేదా హెచ్చరిక అని కొందరు అంటున్నారు. కొంతమంది యూజర్లు తమ ఆలోచనలను పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించారు.
‘‘జంతువులు మమ్మల్ని హెచ్చరించాయి..మేము వినలేదు.. నిన్ననే ఐదు బెలూగా తిమింగలాలు రష్యాలోని కమ్చట్కాలో ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.ఈరోజు రికార్డు స్థాయిలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి ఇది కేంద్రంగా ఉంది. ప్రకృతికి ఎల్లప్పుడూ ముందుగా తెలుసు. ఇదే హెచ్చరిక’’ అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చారు.
సైంటిఫిక్ గా ఎలాంటి ఫ్రూప్ లేదు..గానీ దశాబ్దాలుగా జంతువులు భూమి అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే సామర్థ్యాన్ని చూసి శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. ఇది పక్షులు, సముద్ర తాబేళ్లు, ఎండ్రకాయలు ,కొన్ని మొక్కలు వంటి జీవులకు దిశను కనుగొనడంలో, వలస వెళ్లడంలో ,సుదూర ప్రాంతాలకు నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రకృతిలో విస్తృతంగా గమనించబడినప్పటికీ, మానవులు వీటి నైపుణ్యాన్ని ఆచరణాత్మక మార్గంలో పంచుకున్నట్లు కనిపించడం లేదు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు జంతువులు అసాధారణ ప్రవర్తనను ప్రదర్శించిన అనేక సందర్భాలు ఉన్నాయి. చాలామంది వాటి ప్రవర్తన సహజ హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తుందని, ప్రాణాలను కాపాడుతుందని నమ్ముతారు.