నూక్/కోపెన్హెగెన్: ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్లాండ్ను ఎలాగైనా విలీనం చేసుకుంటామంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన బెదిరింపులపై గ్రీన్లాండ్ ప్రజలు మండిపడ్డారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, తాము అమెరికాలో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
శనివారం గ్రీన్లాండ్ రాజధాని నూక్ సిటీలో ఈమేరకు వేలాది మంది నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 56 వేల మంది జనాభా ఉన్న గ్రీన్లాండ్లో శనివారం 4 వేల మంది నిరసనల్లో పాల్గొన్నారని, ఆ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం అరుదని చెప్తున్నారు. గ్రీన్లాండ్ జెండాలు చేతపట్టుకుని, ‘గ్రీన్లాండ్ నాట్ ఫర్ సేల్’, ‘మేం అమెరికన్లుగా మారాలనుకోవడం లేదు’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రజలు ర్యాలీలో ప్రదర్శించారు.
గ్రీన్లాండ్ సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఐకమత్యం చాటారు. మరోవైపు, డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్లోనూ అక్కడి ప్రజలు శనివారం ట్రంప్ కు వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకుంటామన్న ట్రంప్ కామెంట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, డెన్మార్క్ కింగ్డమ్లో స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగంగా గ్రీన్లాండ్ కొనసాగుతోంది. గ్రీన్లాండ్కు సొంత ప్రభుత్వం, పాలన ఉండగా.. ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్ మాత్రమే డెన్మార్క్ పరిధిలో ఉన్నాయి.
