
- అప్పుతీసుకున్న వ్యక్తి భార్య ఫోటోను ఆమె ఫోన్ నెంబర్ తో అశ్లీల సైట్ లో అప్ లోడ్
- కరీనంగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో దారుణం
కరీంనగర్: అప్పు తీసుకుని చెల్లించకుండా సతాయిస్తున్నాడని అప్పిచ్చిన వ్యక్తి దారుణానికి తెగించాడు. తన అప్పు చెల్లించని వ్యక్తి భార్య ఫోటోను సంపాదించి..సదరు ఫోటోను అశ్లీల వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. అంతేకాదు.. ఆమె ఫోటోపై ఆమె వాడుతున్న ఫోన్ నెంబర్ యాడ్ చేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
తనకు అశ్లీల.. అసభ్య ఫోన్ కాల్స్ వస్తుండడంతో గృహిణి విసిగిపోయింది. తన పేరు.. ఫోన్ నెంబరు కరెక్టుగానే చెబుతూ.. అసభ్యంగా.. అశ్లీల మాటలు మాట్లాడుతుండడంతో ఆమె విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ప్రాథమిక విచారణలో తన భర్తకు అప్పిచ్చిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానాలు కలిగాయి. పోలీసులు నిఘా పెట్టగా సదరు మహిళ భర్తకు అప్పిచ్చిన వ్యక్తే నని గుర్తించారు. తన వద్ద తీసుకున్న 70 వేల రూపాయలు అప్పు చెల్లించడం లేదని అతని భార్య ఫొటోను సేకరించాడు. సదరు ఫోటోను ఆమె ఫోన్ నెంబర్ ను జత చేసి అశ్లీల సైట్ లో అప్ లోడ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.