భారతీయ జీవనశైలే మానవాళికి మంచిదా.?

V6 Velugu Posted on Jun 11, 2021

‘చైనా వైరస్ ఫస్ట్ వేవ్ భారతీయుల జీవన విధానాన్ని అందరూ ఆచరించేలా చేస్తే, సెకండ్ వేవ్ భారతీయ ఆయుర్వేదం ప్రాధాన్యతను తెలియజేసింది’ ఇదీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న విషయం. ఇక ముందు మానవాళి మనుగడకు భారతీయ జీవన విధానం, ఆయుర్వేదం రెండూ తప్పనిసరా? అంటే 
దానికి అవుననే జవాబు లభించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆధునిక సైన్స్ మాత్రమే గొప్పదని చెప్పే వారు దీన్ని కూడా జీర్ణించుకోక తప్పదు. లేదంటే ఇలాంటి వైరస్ ల బారిన పడాల్సి వస్తుంది.

గతంలో మన ఇంటికి ఎవరు వచ్చినా మొదట వారికి నీళ్లు ఇచ్చి కాళ్లు కడుక్కోమనే వారు. అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తితో పాటు సూక్ష్మక్రిములు వచ్చే అవకాశం ఉందనే విషయం నేరుగా చెప్పకుండా ఒక ఆచారంగా మన పూర్వీకులు ప్రవేశపెట్టారు. కరోనా వ్యాప్తి చెందగానే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే విధానాన్ని అనుసరించడం మనం చూస్తున్నాం. అలాగే షేక్ హ్యాండ్ కు బదులుగా నమస్కారం అనే సంస్కారం కూడా. 

సైన్స్​ అంటే భారతీయ విజ్ఞాన శాస్త్రమే

నేడు గొప్పగా చెప్పే సైన్స్ అనేది బ్రిటిష్ వారి పారిశ్రామిక విప్లవంతో అంటే సుమారుగా క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి అంటే 400-నుంచి 500 ఏండ్ల క్రితం మాత్రమే పురుడుపోసుకుందని నేను చదువుకునేటప్పుడు తెలుసుకున్న విషయం. అంతకు ముందు సైన్స్ లేదా అంటే ఉండేది. అదే భారతీయ విజ్ఞానం శాస్త్రం. ఓర్లివిల్లే, విల్బర్ రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిన తర్వాతనే ఆకాశయానానికి విమానం అవసరమని ప్రపంచ మానవాళికి తెలిసినట్లుగా మనందరికీ తెలుసు. అయితే అంతకు కొన్ని లక్షల ఏండ్ల క్రితమే త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం నుంచి అయోధ్యకు పుష్పక విమానంలో లక్ష్మణ, సీతా సమేతంగా ఆకాశమార్గంలో వచ్చినట్లుగా రామాయణంలో ఉందని ఎంత మందికి తెలుసు? అంతెందుకు ద్వాపర యుగంలో పాండవులను హతమార్చడానికి శకుని, ధుర్యోదనుడు ప్రత్యేకంగా లక్కతో ఇంటిని నిర్మించినట్లుగా మహాభారతం ద్వారా తెలుస్తోంది. లక్కకు సులువుగా మండే స్వభావం ఉందనే విషయం అప్పటి సైన్స్ కాకపోతే మరేమిటి? 

భారతీయుల ఆచారాల్లో సైన్స్​ ఉంది

భారతీయులు అనాదిగా ఆచారాల రూపంలో అనుసరిస్తున్న ప్రతి విషయంలో సైన్స్ ఉందనేది నిర్వివాదాంశం. ఉదయం లేవగానే గతంలో బొగ్గుతోనో, ఉప్పుతోనో, ఆవుపేడతో వేసిన పిడకలను కాల్చగా వచ్చిన బూడిదతోనో పళ్లు తోముకునే వారం. దీనిని నాగరికులం, బాగా చదువుకున్నాం అనుకునే కొంతమంది మిడిమిడి జ్ఞానంతో విమర్శించే వారు. కానీ ఇప్పుడు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా?, మీ పేస్ట్ లో బొగ్గు ఉందా? లాంటి లక్షలాది రూపాయల వ్యయంతో చేస్తున్న ప్రకటనలను టీవీల్లో చూస్తున్నాం. ఇవి లేవు కాబట్టే చాలామంది పళ్లూడగొట్టుకుంటున్నారు. ఆచారాలను పాటించారు కాబట్టే మన పూర్వీకుల పళ్లు మరణించే దాకా ఊడిపోకుండా ధృఢంగా ఉండేవి. భారతీయులు తమ ఇండ్ల ముందు, ఇంటి గడపకు వేసే ముగ్గులో కూడా సైన్స్ ఉంది. గోడలకు సున్నం వేసేవారు. సూక్ష్మక్రిములను సంహరించి అవి మన ఇంట్లోకి రాకుండా నిరోధించే గుణం ముగ్గు పిండి, సున్నంలో ఉందనే విషయం ఎప్పుడో రుజువైంది. ఇప్పుడు రకరకాల రంగులు వాడుతూ మన ఆరోగ్యాన్ని మనమే డబ్బులు వెచ్చించి మరీ చెడగొట్టుకుంటున్నాం. అయితే ఇది మంచిదనే విషయాన్ని భారతీయ విజ్ఞానులు చెప్తే మనం నమ్మం. అదే విషయాన్ని నాసానో, ఏ విదేశీయుడో చెప్పాలి. అప్పుడు మనకు జ్ఞానోదయమవుతుంది. అంతెందుకు రామాయణ, మహాభారతాలు వట్టి పుక్కిటి పురాణాలని చెప్పేవారు. సముద్రంలో ద్వారకా నగర అవశేషాలు బయట పడగానే ఈ సో కాల్డ్ మేధావులు నోళ్లు మూసుకున్నారు. 

రైతులు ఏ యూనివర్సిటీల్లో పీజీ చేశారు?

మనం రోజూ తినే ఆహార పంటలను పండించే రైతు ఏ యూనివర్సిటీలో వ్యవసాయ పీజీ పట్టా తీసుకున్నాడు? ఆ పంటలకు ఎక్కడ ట్రయల్స్ నిర్వహించారని వాడుతున్నాం? ఏ సైన్స్ చదివాడని సుశృతుడు ప్రపంచ మొట్టమొదటి శస్త్ర శాస్త్ర నిపుణుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గడించాడు? తిక్కన ఏ పీజీ చేశాడని ఆయన కవిత్వం గురించి రాయకపోతే తెలుగులో డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇవ్వరు? కౌటిల్యుని అర్థశాస్త్రం చదవకపోతే పొలిటికల్ సైన్స్ లో పీజీ కాదు కదా డిగ్రీ సర్టిఫికెట్ కూడా రాదు. ఏ వైద్యశాస్త్రం చదివాడని పతంజలి ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు? ఏ ఖగోళ శాస్త్రం చదివారని భాస్కరాచార్యుడు, ఆర్యభట్టు ఖగోళ విషయాల్ని ప్రపంచానికి ఈ అధునాతన సైన్స్ కంటే ముందే తెలియజేశారు? అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసింది భారతీయులు కాదా? అలాంటి నిపుణుల చేతులు నరికేసిన చరిత్ర నిజం కాదా? మహిళలు కాళ్లకు పారాణి రాసుకోవడం ద్వారా నీటిలోని సూక్ష్మక్రిములతో రోగాలు రావనేది సైన్స్ కాదా? ఒక రకంగా చెప్పాలంటే భారతీయ విజ్ఞానాన్ని కుట్రపూరితంగా మూఢనమ్మకాలు, అనాగరికం లాంటి సొల్లు కబుర్లతో మరుగున పడేలా చేసి ఇప్పటి సైన్స్ కు ప్రాధాన్యం పెరిగేలా చేశారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

గుడిలో ఇచ్చే తీర్థ ప్రసాదాల్లో ఔషధ గుణాలున్నాయి

తమకు తామే మేధావులం అనుకునే కొందరు అజ్ఞానులు ఖగోళంలోని గ్రహగతుల గురించి వివరించే జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక సైన్స్ కాదంటారు? అయితే రాబోయే పదేండ్లలో ఎన్ని సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తాయి? వాటి పట్టు విడుపుల వివరాలు ఈ సో కాల్డ్ మేధావులు చెప్పగలరా? అదే గుడిలో పూజలు చేసే సామాన్య బ్రాహ్మణోత్తములు ఏ మైక్రోస్కోపులు లేకుండానే కచ్చితంగా నిమిషాలు సెకన్లతోపాటు చెప్పగలరు. ఇదీ అసలు సిసలు సైన్స్ అంటే? గుడిలో పూజారి ఇచ్చే తీర్థ ప్రసాదాల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. శబరిమల క్షేత్రంలో ఇచ్చే ప్రసాదంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కదా. 

గ్లవ్స్, పీపీఈ కిట్ లేకుండా ట్రీట్మెంట్​ చేయగలరా?​

ఎన్ని ఔషధాలు, వ్యాక్సిన్ లు కనుగొన్నా కరోనాను ప్రపంచ దేశాలు నివారించ లేకపోతున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. డబ్బులు పోయి ఇల్లు గుల్లవుతున్నా, చివరికి  అంత్యక్రియల కోసం మనిషి మృతదేహం కూడా తీసుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతున్నట్లు, పోయే ప్రాణాలు నిలబెడుతున్నట్లు రుజువైన ఆనందయ్య ఆయుర్వేద మందుకు అడ్డంకులు ఎందుకు? ఒకవేళ దురదృష్టవశాత్తు ఆయుర్వేద మందు పనిచేయక రోగి మరణించినా కనీసం అంత్యక్రియలు జరుపుకోవడంతోపాటు డబ్బులు పోయి ఇల్లు గుల్లయ్యే పరిస్థితి ఉండదు కదా? ఆధునిక వైద్యమే గొప్పదని చెబుతున్న ఏ ఒక్క వైద్య నిపుణుడైనా మాస్క్, గ్లవ్స్, పీపీఈ కిట్ వాడకుండా కరోనాకు ట్రీట్మెంట్ చేయగలడా? కానీ, ఆనందయ్య ఏ వైద్య శాస్త్రం చదవకపోయినా ఇవేవీ లేకుండానే వేలాది మందికి చికిత్స చేశారు. కృష్ణపట్నంలో ఇప్పటిదాకా ఏ ఒక్కరూ మాస్క్ లు, గ్లవ్స్ వాడలేదట? అయినా ఏ ఒక్కరికీ కరోనా సోకలేదట కూడా. అలాంటప్పుడు ఈ ఆయుర్వేద మందు అన్నా, పసరు మందు అన్నా ఇంకా రుజువులేం కావాలి? 

మన ఆచారాలపై పరిశోధనలు జరగాలి

మన జ్ఞాన సంపదను మనం అపోహలతో వదులుకున్నప్పటికీ జర్మనీలాంటి దేశాలెన్నో మన వేద విజ్ఞానం, పురాణ ఇతిహాసాలపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. భారతీయుడైన బోధిసత్వుడు అందించిన విజ్ఞానాన్ని చైనా ఇప్పటికీ గౌరవిస్తోంది. ఇప్పటికీ ఎన్నో గొప్పగొప్ప కొత్త విషయాల్ని కనిపెట్టిన ప్రస్తుత సైన్స్ మూలాలు నిజాయితీగా చెప్పాలంటే ఎక్కడో ఒక దగ్గర పుష్పక విమానంలాగా భారతీయ విజ్ఞానం దగ్గరికి వచ్చి ఆగే అవకాశం ఉంది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం భారత విజ్ఞానం, హిందువుల ఆచార వ్యవహారాలపై విస్తృతంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గతంలో అణచివేతకు గురైన రామర్ పిళ్లై తయారు చేసిన మూలికా పెట్రోల్, యోగి వేమన ఆయుర్వేద మూలికలతో చేశారంటున్న బంగారంలాంటి విజ్ఞానంపై మేకిన్ ఇండియాలో భాగంగా పరిశోధనలు పెంచాలి. తద్వారా మళ్లీ భారతదేశం విశ్వగురువుగా భాసిల్లుతూ విశ్వశాంతికి, మానవాళి మనుగడకు దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- శ్యాంసుందర్ వరయోగి,
సీనియర్ జర్నలిస్ట్

Tagged indian, survival, Both, essential, Mankind, life and Ayurveda

Latest Videos

Subscribe Now

More News