తాజా గాలి కావాలా?.. ఒక్కో బాటిల్ ధర రూ.2,500 మాత్రమే!

తాజా గాలి కావాలా?.. ఒక్కో బాటిల్ ధర రూ.2,500 మాత్రమే!
బర్మింగ్‌‌హామ్: యూకేలో ఉన్న మీ మిత్రులకు క్రిస్‌‌మస్‌‌కు ఏమైనా గిఫ్ట్స్ పంపాలనుకుంటున్నారా? అయితే పెద్దగా ఆలోచించకండి. మంచి తాజా గాలిని పంపండి. ఏంటి గాలిని పంపడమేంటని అనుకుంటున్నారా? ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్‌‌తోపాటు వేల్స్‌‌లో ఉంటున్న తమ బంధువులకు చాలా మంది ఎయిర్ బాలిళ్లను పంపిస్తున్నారు. ఈ బాటిల్స్‌‌ను తెరవగానే ఫ్రెష్ గాలి వస్తుంది. కొన్ని వారాలు, నెలల పాటు వీటిని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ గాలి సీసాలను తయారు చేసిన మై బ్యాగేజ్ అనే సంస్థ మనుషుల ఎమోషన్స్‌‌కు తగ్గట్లుగా సువాసనను అందించే పరిమళభరితమైన బాటిళ్లను అందించే దిశగా యత్నిస్తున్నట్లు తెలిపింది. లండన్ అండర్‌‌గ్రౌండ్, ఫిష్ అండ్ చిప్స్ ఎడిషన్స్ పేరుతో పలు బాటిళ్లను ఈ కంపెనీ అందిస్తోంది. అలాగే ఐరిష్ ఎయిర్, స్కాటిష్ ఎయిర్, ఇంగ్లిష్ ఎయిర్, వేల్స్ ఎయిర్ పేరుతో వివిధ రకాలుగా మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఒక్కో బాటిల్ ధర భారత కరెన్సీలో సుమారుగా రూ.2,478గా ఉంది. విదేశాలకు వెళ్లిన యూకే ప్రజలు ఈ ఫ్రెష్ ఎయిర్ బాటిళ్ల ద్వారా స్వచ్ఛమైన గాలిని అందించడమ కోసమే ఈ ప్రయత్నం చేశామని మై బ్యాగేజీ పేర్కొంది. బ్రిటన్‌లోని కొందరు తల్లిదండ్రులు ఏళ్లుగా ఇతర దేశాల్లో ఉంటున్న తమవారిని ఈ గాలి సీసాలను గిఫ్ట్‌‌లుగా పంపిస్తుండటం వీటికి ఉన్న క్రేజ్‌‌కు అద్దం పడుతోంది. సీసాల్లో గాలిని అందించిన తొలి సంస్థగా స్విస్‌బ్రీజ్‌‌ను చెప్పొచ్చు. స్విస్ పర్వతాల్లోని తాజా గాలిని సీసాల్లో నింపి 2018లో ఈ కంపెనీ అమ్మకాలు మొదలుపెట్టింది. ఇప్పుడు మై బ్యాగేజీతో ఎయిర్ బాటిల్స్‌‌కు యూరప్‌‌లో క్రేజ్ ఏర్పడింది.