
Gold News: భారతీయులు పసిడి ప్రియులని మనందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో ఉండే వారి వరకు అందరూ బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలు లేనప్పుడు సైతం చాలా మంది నిరంతరం గోల్డ్ కొంటూనే ఉన్నారు. అయితే తెలియక చేసే కొన్ని తప్పులు వారిని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి.
పన్ను అధికారులు నిర్థేశించిన నియమాలను పాటించకపోతే నోటీసులు అందుకునే ప్రమాదం ఉంది. వాస్తవానికి బంగారం కొనుగోలుకు ఎలాంటి ప్రత్యేక పరిమితి నిబంధనలు లేనప్పటికీ.. నగదు ఉపయోగించి బంగారం కొనటంపై పరిమితులు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. రూల్స్ ప్రకారం ఒక రోజులో వ్యక్తులు రూ.2 లక్షలు మాత్రమే బంగారం కొనుగోలుకు నగదు రూపంలో చెల్లించటానికి వీలు కల్పించబడింది. దీనికంటే విలువైన లావాదేవీ చేసినప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఆన్ లైన్ చెల్లింపు విధానాలను ఉపయోగించాలని పన్ను చట్టాలు చెబుతున్నాయి.
ALSO READ | SIP News: రూ.10వేల పెట్టుబడిని రూ.కోటిగా మార్చిన ఫండ్, మీరూ సిప్ చేస్తున్నారా..?
అలాగే షాపు యజమానులు సైతం ఇలాంటి అధిక విలువ కలిగిన నగదు చెల్లింపుల విషయంలో కస్టమర్ల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. రూ.2 లక్షల కంటే విలువైన బంగారు ఆభరణాలను ఎవరైనా నగదు రూపంలో కొన్నప్పుడు వాటి వివరాలను నగల వ్యాపారులు ఆదాయపు పన్ను అధికారులకు అందించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా అధికారులు సదరు వ్యక్తులకు నోటీసులు పంపి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో నగల వ్యాపారులు కస్టమర్లకు సంబంధించిన పాన్, ఆధార్ వంటి పత్రాల వివరాలను సేకరించటం తప్పనిసరి. తద్వారా అధికారులు దర్యాప్తుకు వచ్చినప్పుడు వ్యాపారులు సైతం చిక్కుల్లో పడకుండా ఉంటారు. దర్యాప్తు సమయంలో నిబంధనలు పాటించనట్లు తేలితే వ్యాపారులపై పన్ను శాఖ జరిమానా కూడా విధిస్తుంది. అందుకే డబ్బుతో రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేయకపోవటం ఉత్తమం. ఇలాంటి సమయంలో డిజిటల్ చెల్లింపు విధానాలను వ్యక్తులు ఉపయోగించటం సమస్యలను తగ్గిస్తుంది.