ఓటుకు 20వేలు ఇస్తామంటున్నారట

ఓటుకు 20వేలు ఇస్తామంటున్నారట
  • మన జీవితాలను.. తల రాతలను మార్చే ఎన్నిక ఇది.. ఆషామాషీగా తీసుకోవద్దు
  • నేను రాజీనామా చేస్తేనే ఇన్నొచ్చాయి.. గెలిస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది
  • హక్కులతో ఉద్యమించే వారికి.. ఆకలితో అలమటించే వారికి గొంతునవుతా
  • జమ్మికుంట వడ్డెర సంఘం సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్: ‘‘పేద వర్గాలకు చెందిన వారు రాజకీయాల్లోకి రాకుండా డబ్బు మయ చేశాడు కేసీఆర్.. అక్రమంగా సంపాదించుకున్న కాళేశ్వరం డబ్బులు తీసుకు వచ్చి ఓటుకి 20 వేలు ఇస్తారట.. మన జీవితాలను, మన తల రాతలను మార్చే ఎన్నిక ఇది. అశామాషీగా తీసుకోవద్దు. మీ హక్కుల కోసం పోరాడే భాధ్యత నాది..’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నేను రాజీనామా చేస్తేనే ఇన్నొచ్చాయి.. గెలిస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందనే విషయం గుర్తించాలని ఈటల రాజేందర్ సూచించారు. హక్కులతో ఉద్యమించే వారికి.. ఆకలితో అలమటించే వారికి గొంతునవుతానని ఆయన స్పష్టం చేశారు. 
గురువారం జమ్మికుంట వడ్డెర సంఘం సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి,  జాతీయ డీ నోటిఫైడ్ కాస్ట్ కమీషన్ సభ్యులు నరసింహ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ సమావేశంలో బీజేపీ నేతలు, ధర్మారావు రమేష్ రాథోడ్, యెండల లక్ష్మీనారాయణ, వడ్డెర సంఘం అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్బంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించానని గుర్తు చేశారు. దేశాన్ని పాలించే పార్టీ బీజేపీ అని.. సుస్థిరత అందించిన నాయకుడు మోడీ అని వివరించారు. తెలంగాణ గడ్డమీద 2023లో ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనన్నారు. టీఆర్ఎస్ లో చేరకపోతే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనీయమని, వృత్తి చేసుకోమని బెదిరించారట.. ఇంత భయపెట్టినా .. ఎవరూ భయపడకుండా నాతో వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బలవంతంగా తీసుకెళ్తే.. నడుస్తదా? 30న ఓట్ల రూపంలో గుద్దుడు గుద్దుతే దిమ్మతిరగాలని ఈటల పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో నాకు 18 ఏళ్లుగా ఏ బాధ్యత ఇచ్చినా సమర్ధవంతంగా చేశాను, కొడుకా నేను పార్టీలోకి మధ్యలో వచ్చాను, పార్టీ చరిత్ర 20 ఏళ్లైతే.. అందులే నా చరిత్ర 18 ఏళ్లని వివరించారు. 
వడ్డెరలు రెండు తరాలు కొట్టినా తరగని గుట్టలు రోజుల్లో ధ్వంసం చేస్తున్నారు
వడ్డెరలు రెండు తరాలు కొట్టినా తరగని గుట్టలు.. గ్రానైట్ వ్యాపారులు రోజుల వ్యవధిలో ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల ఆరోపించారు. బండ కొట్టుకుని బతికే ఒడ్డెరలపై అటవీ, ఫారెస్టు అధికారులు కేసుల పేరుతో వేధిస్తున్నారని, మా బతుకులు మారాలని తమ పిల్లలను ఒడ్డెర కులస్థులు చదివించుకుంటే వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. వడ్డెరల బతుకులు బాగుపడాలంటే 5 కోట్ల విలువైన పనుల్లో ఈఎండీ లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాలని ఆయన డిమాడ్ చేశారు. గుట్టలపై, రాళ్లపై మైనింగ్, అటవీ, ఫారెస్టు అధికారుల వేధింపులు లేకుండా హక్కులు ఇవ్వాలన్నారు. ఈటలను ఓడించాలని, తన ముఖం ఆసెంబ్లీలో కనిపించకూడదనే దళితబంధు తెచ్చారు, నేను సీఎంకు డిమాండ్ చేస్తున్నా... మా దళిత జాతి బాగుపడాలంటే.. కలెక్టర్ల ప్రమేయం లేకుండా, బ్యాంకుల ఆధిపత్యం లేకుండా పది లక్షలపై సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. మా ఒడ్డెరలకు, ఇతర సంచార జాతులకు, నిరుపేదలందరికీ దళితబంధులాంటి పథకం తెచ్చి పదిలక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల్లోనూ పేదలున్నారని, పేదరికానికి, ఆకలికి కులంతో సంబంధం లేదని తెలిపారు. 
దొంగ ఉత్తరం సృష్టించాడు.. 
నేను దళితులకు దళితబంధు ఇవ్వకూడదని రాసినట్లు కేసీఆర్ దొంగ ఉత్తరం సృష్టించాడని ఈటల రాజేందర్ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పడి.. దావతులు ఇచ్చినా, ఎన్ని డబ్బులిచ్చినా, కండువాలు కప్పినా.. జనం ఈటలనే గెలిపిస్తామంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గడ్డమీద పుట్టగతులుండవని, 2023లో టీఆర్ఎస్ పతనం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అక్టోబర్ 30న జరిగే ఎన్నికల్లో హుజురాబాద్ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతోందని తెలిపారు. టీఆర్ఎస్ మీటింగుల్లో పసలేదు, మన మీటింగుల్లో హారతి పట్టి పూలవర్షం కురిపిస్తున్నారని ఈటల వివరించారు. ఫించన్లు, రేషన్ కార్డులు, గొర్రెలు, దళితబంధులాంటి వన్నీ కేవలం హుజురాబాద్ లో మాత్రమే వచ్చాయని, రోడ్లు వేసినా, బిల్లులు ఇచ్చినా ఒక్క హుజురాబాద్ లోనే ఇస్తున్నారంటే మన మీద ప్రేమ ఉండి కాదు, వీటన్నింటి వెనక నన్ను ఓడించాలనే కుట్రపూరిత కత్తి మీకిస్తున్నాడని ఈటల రాజేందర్ హెచ్చరించారు.