వాషింగ్టన్: ఇండియా, పాక్ యుద్ధాన్ని ఆపింది తానే అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. ఇప్పటివరకు 8 యుద్ధాలు ఆపానని, అయినా తనకు సరైన గుర్తింపు రాలేదని అన్నారు. నోబెల్ శాంతి బహుమతి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మంగళవారం ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో ఎస్టేట్‌లో జరిగిన భేటీ సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్లు చేశారు.
‘‘ఎనిమిది యుద్ధాలు ఆపిన. అందులో భారత్, పాక్ యుద్ధం ఒకటి. ఆర్మేనియా అజర్‌బైజాన్ యుద్ధాన్ని టారిఫ్‌ల బెదిరింపుతో ఒక్కరోజులోనే ఆపేసిన. కానీ, నాకు క్రెడిట్ రాలే” అని నెతన్యాహుతో ట్రంప్ అన్నారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా తన ప్రయత్నాలను మెచ్చుకున్నారని గుర్తుచేశారు.
కాగా, భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది తానే అంటూ మొదటిసారి ట్రంప్ మే 10న తన సోషల్ ట్రూత్‌లో ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది తానే అంటూ 70 సార్లు చెప్పారు. అయితే, భారత్ మాత్రం ఈ వాదనను పదేపదే తిరస్కరిస్తోంది. భారత్, పాక్ దేశాలు ద్వైపాక్షిక సంప్రదింపులతోనే ఆపరేషన్ సిందూర్ ఆగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి.. ట్రంప్ ఆగ్రహం
రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నివాసం మీద ఉక్రెయిన్ అటాక్ చేసిందన్న వార్తలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఇలా దాడులు చేయడమేంటని మండిపడ్డారు. పుతిన్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం తనతో చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
‘‘యుద్ధంలో దాడులు కామన్. కానీ, ఏకంగా అధ్యక్షుడి ఇంటినే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. తన ఇంటిపై ఉక్రెయిన్ అటాక్ చేసిందని పుతినే ఫోన్ చేసి చెప్పిండు. ఇది ఉపేక్షించేది కాదు” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్ దాడి చేసింది నిజమేనా కాదా అనే విషయంపై తనకు ఇంకా పూర్తి స్పష్టత లేదని చెప్పారు. పుతిన్ ఇంటిపై తాము దాడి చేయలేదని, అందుకు రష్యా కూడా ఎటువంటి ఎవిడెన్స్‌లు చూపించలేదని ఉక్రెయిన్ కొట్టిపారేసింది.
