13 నుంచి పతంగుల పండగ!..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్కార్ ఏర్పాట్లు

13 నుంచి పతంగుల పండగ!..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్కార్ ఏర్పాట్లు
  •     19 దేశాల నుంచి రానున్న 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు.. 
  •     16 నుంచి ‘హాట్ ఎయిర్ బెలూన్’ సందడి..

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో పతంగుల జాతర మొదలు కానున్నది. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్–2026 నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. 

జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్​లో ఈ సంబురాలు కొనసాగనున్నాయి. గాలిపటాలతోపాటు నోరూరించే స్వీట్లు, కళ్లు చెదిరే డ్రోన్ షోలు, హాట్ ఎయిర్ బెలూన్లతో హైదరాబాద్ నగరానికి పండుగ శోభ సంతరించుకోనున్నది.

100 స్టాళ్లు, 60 ఫుడ్ కోర్టులు

ఈ సారి కైట్ ఫెస్టివల్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, కంబోడియా, థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్, కొరియా, జపాన్, పోర్చుగల్, వియత్నాం, మలేషియా, ఇటలీ, స్విట్జర్లాండ్, అల్జీరియా, సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్ వంటి 19 దేశాల నుంచి 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ రానున్నారు. మన దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది నేషనల్ ఫ్లయర్స్ కూడా పాల్గొననున్నారు. 

భారీ సైజుల్లో, వెరైటీ ఆకారాల్లో ఉండే గాలిపటాలు ఆకాశంలో సందడి చేయనున్నాయి. జనవరి 13, 14, 15 తేదీల్లో ప్రత్యేకంగా ‘నైట్ ఫ్లయింగ్’ ఈవెంట్ కూడా నిర్వహించేలా ప్లాన్​ చేశారు. అంతేకాకుండా, ఫెస్టివల్​లో భాగంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు చాటిచెప్పేలా కల్చరల్ ఈవెంట్​ను ఏర్పాటు చేస్తున్నారు. చేనేత, హస్తకళలకు సంబంధించి దాదాపు 100 స్టాళ్లు, తెలంగాణ రుచులతోపాటు ఇతర వంటకాలతో 60 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

నేషనల్, ఇంటర్నేషనల్ వెరైటీలతో ‘స్వీట్ ఫెస్టివల్’

కైట్ ఫెస్టివల్​తోపాటే కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ అసోసియేషన్​తో కలిసి ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​లో నివసిస్తున్న వేర్వేరు రాష్ట్రాలు, దేశాలకు చెందినవారు తమ ఇళ్లలో తయారు చేసిన స్వీట్లను ఇక్కడ ప్రదర్శించనున్నారు. దాదాపు 1,200 రకాల స్వీట్లు ఈ ఫెస్టివల్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

గచ్చిబౌలిలో డ్రోన్ షో

గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 13, 14 తేదీల్లో స్పెషల్ డ్రోన్ షో ప్లాన్ చేస్తున్నారు.  హైటెక్ డ్రోన్లు, మల్టీ కలర్ ఎల్ఈడీ లైట్లతో ఆకాశంలో విన్యాసాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు స్టేడియం ఫీల్డ్​ను ఎల్ఈడీ రేస్​కోర్సులా మార్చి, ఎఫ్​పీవీ టెక్నాలజీతో స్క్రీన్లపై లైవ్ చూపించనున్నారు. డ్రోన్లతో సాకర్ ఆడటం, డ్రోన్ల ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను చూపించడం ఈ షోలో హైలైట్​గా నిలవనున్నది.

నైట్ గ్లో బెలూన్స్ ప్రదర్శన..

సంక్రాంతి అయిపోయాక కూడా నగరంలో బెలూన్స్ సందడి కొనసాగనున్నది. జనవరి 16 నుంచి 18 వరకు ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నారు. యూరప్ దేశాల నుంచి 15 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బెలూన్లు రానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోఉదయం, పరేడ్ గ్రౌండ్స్​లో సాయంత్రం ‘నైట్ గ్లో బెలూన్స్’  పేరుతో వీటిని ప్రదర్శించనున్నారు.