
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిత్రాలు సంచలనం సృష్టించాయి. కొన్ని చిన్న సినిమాలు పెద్దసినిమాలకు గట్టి పోటీ ఇచ్చి కాసుల వర్షం కురిపించారు. మరి కొన్ని నిరాశపరిచాయి. నిర్మాతలకు నష్టాలను పంచాయి. అలాంటి పరాజయం పొందిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో పెను తుఫాన్ సృష్టిస్తోంది. పెద్ద సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది. డిజిటల్ విడుదలైన కొద్ది రోజులకే ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ చిత్రమే 'ధడక్ 2'..
'కాంతారా'కు పోటీ!
సాధారణంగా, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సినిమాలు ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ పొందవు. కానీ, 'ధడక్ 2' ఆ నియమాన్ని బద్దలు కొట్టింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో నాలుగో స్థానంలో దూసుకుపోతోంది. 'కాంతారా' వంటి అగ్రస్థానంలో ఉన్న చిత్రాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ విజయంతో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు... థియేటర్‌లో విజయం సాధించకపోయినా, ఓటీటీలో తప్పకుండా విజయం సాధిస్తాయని 'ధడక్ 2' మరోసారి నిరూపించింది.
బాక్సాఫీస్ వద్ద 'జీరో'.. ఓటీటీలో 'హీరో'..
భావోద్వేగభరితమైన సామాజిక కథనం 'ధడక్ 2' చిత్రాన్ని 60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ థియేటర్లలో కేవలం రూ.31.5 కోట్లు మాత్రమే వసూలు చేసి 'ఫ్లాప్' ముద్ర వేయించుకుంది. కానీ, కథ ఇక్కడే ముగియలేదు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం, అనూహ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకుని, ట్రెండింగ్ లిస్ట్‌లో దూసుకుపోతోంది. ఈ జాబితాలో 'కాంతారా' మొదటి స్థానంలో, 'సన్ ఆఫ్ సర్దార్ 2' రెండో స్థానంలో, 'నరసింహ మహా అవతార్' మూడో స్థానంలో ఉండగా, అంతటి భారీ చిత్రాలకు ధీటుగా 'ధడక్ 2' పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది.
కుల వివక్షతో నిండిన విషాద ప్రేమకథ!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నేపథ్యంగా సాగే ఈ కథాంశం భారతదేశంలో అత్యంత సున్నితమైన అంశమైన కుల వివక్ష చుట్టూ తిరుగుతుంది. లా కాలేజీలో కలిసిన నిలేష్ (సిద్ధాంత్ చతుర్వేది) , విధి (త్రిప్తి డిమ్రి)ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే, వారి మధ్య ఉన్న కుల భేదాలు, సమాజంలోని పితృస్వామ్య భావాలు వారి ప్రేమకు అడ్డుగోడలవుతాయి.
సాజియా ఇక్బాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకుంది. సినిమా మొదటి భాగం కాస్త నిదానంగా ఉన్నా, రెండో భాగంలో ప్రేమ విషాదంగా మారే సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్రంగా కదిలిస్తాయి. యువ నటులు సిద్ధాంత్, త్రిప్తిల అద్భుతమైన, పరిణతి చెందిన నటన ఈ సినిమాకు ప్రధాన బలం నిలిచింది.