Mirai OTT Release: OTTలోకి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'మిరాయ్'.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Mirai OTT Release: OTTలోకి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'మిరాయ్'.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

టాలీవుడ్ యంగ్ హీరోస్ తేజ సజ్జా, మంచు మనోజ్ కలిసి నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'మిరాయ్.   ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 12న ఈ మూవీ విడుదలైంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షక్షులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది.  సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ విజువల్ వండర్  మూవీ రూ. 160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఒకటిగా  నిలచింది.

నెల తిరిగే లోపే ఓటీటీలోకి.. 

థియేటర్లలో  'మిరాయ్' సినిమాను మిస్ అయినవారికోసం గుడ్ న్యూస్ చెప్పింది జియో హాట్ స్టార్. అక్టోబర్ 10న హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం,  కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.  గతేడాది హనుమాన్ మూవీ సూపర్ హీట్ అందుకున్న తేజ సజ్జా.. ఈ ఏడాది మిరాయ్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.  ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో విడుదలై నెల తిరిగే లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. 

 

ఫ్యాన్స్ ఫిదా.. 

 కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రతి నాయకుడిగా నటించిన మంచు మనోజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసి..  సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వీరితో పాటు జగపతి బాబు, రితిక నాయక్, శ్రియా శరణ్‌ల నటన కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంచు మనోజ్ కు చాలా కాలం తర్వాత తిరిగి వెండితెరపై తన మార్క్ ప్రదర్శనతో అభిమానుల మెప్పించారు.  ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాల కలయికతో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

కథాంశం.. 

పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ 'మిరాయ్' సినిమా  క్రీ.పూ 250లో చక్రవర్తి అశోకుని కాలంలో సృష్టించబడిన తొమ్మిది పురాతన గ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రంథాలకు సామాన్య మానవులను శక్తివంతమైన దేవతలుగా మార్చే అద్భుతమైన సామర్థ్యం ఉంది.  ఈ గ్రంథాలను సొంతం చేసుకుని దుష్టశక్తిని ప్రపంచంపై రుద్దాలని మంచు మనోజ్ నాయకత్వంలోని 'బ్లాక్ స్వార్డ్' తెగ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో, ఆ పవిత్ర గ్రంథాలను కాపాడటానికి 'సూపర్ యోధగా తేజ సజ్జా రంగంలోకి దిగుతాడు. తన దివ్యదండం 'మిరాయ్' సహాయంతో విలన్లను ఎదుర్కొంటాడు.  ఈ సినిమాలో రితిక నాయక్, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.  హరి గౌర సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..