రెండేండ్ల బాలుడిని లాక్కెళ్లిన కుక్కలు

రెండేండ్ల బాలుడిని లాక్కెళ్లిన కుక్కలు
  • స్థానికులు తరమడంతోతప్పిన ప్రాణాపాయం
  • దాడి చేసిన కుక్కలను బంధించిన బల్దియా
  • అల్లాపూర్​ పీఎస్​ పరిధిలోనిరాణా ప్రతాప్​ నగర్​లో ఘటన 

పంజాగుట్ట, వెలుగు : అల్లాపూర్ ​పీఎస్​ పరిధిలోఉన్న  రాణా ప్రతాప్​నగర్​లో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేండ్ల బాలుడిని కుక్కలు లాక్కెళ్లాయి. చుట్టుపక్కల వారు చూసి తరమడంతో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాణాప్రతాప్​నగర్​లో ఉంటున్న అల్తాఫ్​ఖాన్, వాజిదా బేగం దంపతులకు రెండేండ్ల కొడుకు నవాజ్​ఖాన్​ఉన్నాడు.

తండ్రి అల్తాఫ్ సికింద్రాబాద్​లోని పాన్​ షాపులో పనిచేస్తున్నాడు. ఇతడి భార్య వాజిదా బేగం దివ్యాంగురాలు. ఈమె ఇంటి వద్దే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న నవాజ్ ఖాన్.​ ఇంట్లోకి వెళ్తుండగా రెండు కుక్కలు వెంటపడ్డాయి. ఒక్కసారిగా దాడి చేసి కాళ్లను పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లాయి. అప్పుడే మరో రెండు కుక్కలు వచ్చి కరవడానికి ప్రయత్నించాయి. కొంతదూరం నుంచి ఓ వ్యక్తి, ఇంట్లోంచి ఓ మహిళ అరుస్తూ పరిగెత్తుకు రావడంతో కుక్కలు పారిపోయాయి. బాలుడిని వెంటనే నిలోఫర్​దవాఖానకు తరలించి చికిత్స చేయించి సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు. 

శ్మశానం.. రైల్వే లైన్​ ఉండడంతో

బాధితుల ఇంటి ఎదురుగా రైల్వే లైన్​తోపాటు శ్మశానం ఉంది. దీంతో వీధి కుక్కలంతా అక్కడ జమవుతున్నాయి. శ్మశానం నుంచి రైల్వే లైన్​దాటుకుంటూ ఇండ్ల వద్దకు వచ్చి మనుషులతోపాటు, మేకలు, కోళ్లను కరుస్తున్నాయని బాధిత బాలుడి తాత మహ్మద్​ఇలియాస్​ చెప్పారు. గతంలోనూ  ఓ బాలుడిని తీవ్రంగా గాయపర్చాయని, 8 కోళ్లు, మేకను చంపేశాయని చెప్పాడు.  రైల్వే లైన్​వద్ద ప్రహారీ నిర్మించాలని కోరితే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. ఘటన గురించి తెలుసుకున్న బల్దియా వెటర్నరీ  విభాగం ఇన్​చార్జి ​డిప్యూటీ డైరెక్టర్ ​డాక్టర్​ వెంకటేశ్వర్​రెడ్డి బాలుడి ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బల్దియా సిబ్బంది ఆ ఏరియాకు వచ్చి దాడి చేసిన కుక్కలను పట్టుకున్నారు. 

చంపాపేటలో ముగ్గురు పిల్లల పై కుక్కల దాడి

ఎల్బీనగర్: చంపాపేట డివిజన్​లో వీధి కుక్కల దాడిలో ఆదివారం ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మాధవనగర్ రోడ్డు నంబర్ 2 హిమాన్షు(5) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. అలాగే రోడ్​ నంబర్​9లో ఇంటి బయట ఉన్న వినేశ్(7) ను కరిచాయి. అలాగే  ఎస్వీ కాలనీలోని ఓ చిన్నారిపై  దాడి చేశాయి.  స్థానికులు కుక్కల తరిమికొట్టి చిన్నారులను కాపాడారు. హిమాన్షు స్థానిక దవాఖానలో, వినేశ్ నల్లకుంటలోని  హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు.