రోడ్డు పక్కన పెట్టెలో ఆరేళ్ల బాబు శవం

రోడ్డు పక్కన పెట్టెలో ఆరేళ్ల బాబు శవం

దాదాపు 64 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన ఒక చిన్న బాక్స్‌‌ దొరికింది. అందులో ఆరేళ్ల అబ్బాయి శవం ఉంది. పోలీసులు కేసు ఫైల్ చేసి, అతనెవరో గుర్తించే పనిలో పడ్డారు. డిటెక్టివ్‌‌లు కూడా చాలా సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేట్‌‌ చేశారు. కేసులో ఎన్నో ఆధారాలు దొరికినా, అబ్బాయిని చంపింది ఎవరనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇప్పటివరకు ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అయినా.. అబ్బాయి ఎవరనేది కూడా కనుక్కోలేకపోయారు.

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కొంతమంది వేటగాళ్లు ఉండేవాళ్లు. వాళ్లు మస్క్‌‌రాట్స్‌‌(చుంచు ఎలుకలు) కోసం ఉర్లు పెట్టేవాళ్లు. జాన్ స్టాచోవియాక్ అనే వేటగాడు ఫాక్స్ చేజ్ సెక్షన్‌‌లోని ఒక రోడ్డు పక్కన చెట్ల పొదల్లో ఉర్లు బిగించాడు. మరుసటి రోజు వెళ్లి చూస్తే.. ఆ ఉర్ల పక్కనే ఒక పెద్ద అట్ట పెట్టె కనిపించింది. పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక అబ్బాయి శవం కనిపించింది. ఆ విషయాన్ని పోలీసులకు చెప్తే, అతను అక్కడికి ఎందుకు వచ్చాడనే విషయం చెప్పాలి. కానీ.. అమెరికాలో చుంచు ఎలుకల్ని వేటాడడం నిషేధం. వేటాడినందుకు అతనికి కూడా శిక్ష పడుతుంది. అందుకే అతను ఏమీ చూడనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండు రోజులకు అంటే ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 3:45 గంటలకు 26 ఏళ్ల ఫ్రెడరిక్ జే. బెనోనిస్ అదే రోడ్డులో కార్‌‌‌‌లో వెళ్తున్నప్పుడు పక్కనే ఒక కుందేలు కనిపించింది. దానికోసం అతను చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అప్పుడు బెనోనిస్‌‌కు కూడా పిల్లోడి శవం కనిపించింది. అతడు కూడా భయంతో పోలీసులకు కంప్లైంట్‌‌ చేయలేదు. ఆ తర్వాత రోజు పేపర్‌‌‌‌లో నాలుగు  సంవత్సరాల అమ్మాయి తప్పిపోయినట్టు వార్త వచ్చింది. అది చూసిన వెంటనే ఆ అమ్మాయే చనిపోయి ఉంటుందని బెనోనిస్‌‌ పోలీసులకు ఫోన్‌‌ చేసి విషయం చెప్పాడు. కానీ.. ఆ పెట్టెలో ఉన్నది ఆడపిల్ల కాదు. పైగా తప్పిపోయిన అమ్మాయి వారం రోజుల్లో దొరికింది. ఆమె ఒక పాడుబడిన ఇంట్లో చిక్కుకుని ఆకలితో చనిపోయింది. 

ఇంతకీ ఎవరు?
బాక్స్‌‌లో దొరికిన అబ్బాయి ఎవరనేదాని మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది. బాడీని పోస్ట్‌‌మార్టం చేశారు. అబ్బాయి వయసు నాలుగు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిసింది. 30 పౌండ్ల బరువు, 3 అడుగుల ఎత్తు ఉన్నాడు. పోషకాహార లోపం ఉండడం వల్ల చూడ్డానికి రెండేళ్ల పిల్లోడిలా కనిపిస్తున్నాడు. జుట్టు చాలా షార్ట్​గా ఉంది. బాడీపై, దుప్పటిపై కత్తిరించిన వెంట్రుకలు ఉన్నాయి. అంటే చంపేసిన తర్వాత హెయిర్‌‌‌‌ కట్‌‌ చేసి ఉంటారు. ఎడమ కాలి చీలమండపై చిన్న మచ్చలు ఉన్నాయి. తలపై రెండు గాయాలున్నాయి. తొడపై ఆపరేషన్‌‌ చేసిన గుర్తులు ఉన్నాయి. అతని గడ్డం మీద ఇంగ్లిష్ లెటర్‌‌‌‌ ‘ఎల్‌‌’ -ఆకారంలో మచ్చ ఉంది. అయితే ఈ ఆధారాలతో అతను ఎలా చనిపోయాడనేది మాత్రం తెలియలేదు. అతను ఎప్పుడు చనిపోయాడు? ఎంతసేపటి నుంచి శవం పెట్టెలో ఉంది? అనేది కూడా తెలుసుకోలేకపోయారు. ఈ బాక్స్‌‌ గురించి న్యూస్‌‌ పేపర్లలో వార్తలు వచ్చాయి. ‘‘ది బాయ్ ఇన్ ది బాక్స్” పేరుతో ఈ కేసు గురించి అందరికీ తెలిసింది. పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. ఇన్వెస్టిగేషన్‌‌ మొదలుపెట్టారు. కానీ.. ఏ వైపు నుంచి ఎంక్వైరీ చేసినా దారులు మూసుకుపోతూనే ఉన్నాయి. 

ఎవరూ రాలేదు
శవాన్ని ఫొటోలు తీసి, న్యూస్‌‌పేపర్లలో ప్రింట్‌‌ చేయించారు. శవాన్ని తీసుకోవడానికి ఎవరూ రాలేదు. దాంతో పోలీసులు ఆ శవం దొరికిన చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆ అబ్బాయి ఫొటో చూపిస్తూ చాలామందిని ఎంక్వైరీ చేశారు. అందరూ తెలియదనే సమాధానమే చెప్పారు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో ఎంక్వైరీ చేయడానికి 400 మంది పోలీసులను నియమించారు. అయినా.. ఫలితం లేకపోయింది. ఈజీగా గుర్తుపట్టడానికి అబ్బాయి కూర్చున్నట్టు క్రియేట్‌‌ చేసిన ఫొటోలు, బట్టలు వేసుకుని ఉన్న ఫొటోలు రిలీజ్‌‌ చేశారు. అయినా రెస్పాన్స్‌‌ రాలేదు. 

పెట్టెతో ఇన్వెస్టిగేషన్‌‌
అబ్బాయిని ప్యాక్‌‌ చేసిన అట్ట పెట్టె.. ఉయ్యాలలను ప్యాక్‌‌ చేసేదిగా గుర్తించారు. దాని మీద “ఫర్నిచర్, ఫ్రజల్​, డు నాట్‌‌ ఓపెన్‌‌ విత్‌‌ ఏ నైఫ్‌‌” అని రాసి ఉంది. శవాన్ని ఒక దుప్పటిలో చుట్టి ఆ బాక్స్‌‌లో పెట్టారు. ఆ ఉయ్యాల కంపెనీ వాళ్లను ఇన్వెస్టిగేట్‌‌ చేశారు పోలీసులు. ఆ బాక్స్‌‌లో అమ్మిన లాంటి ఉయ్యాలలు మొత్తం 12 మాత్రమే తయారు చేసింది ఆ కంపెనీ. అవి కొన్నవాళ్లలో ఎనిమిది మంది వివరాలు తెలిశాయి. వాళ్లందరినీ పోలీసులు ఇన్వెస్టిగేట్‌‌ చేశారు. కానీ.. వాళ్లలో ఎవరికీ ఈ అబ్బాయితో సంబంధం లేదని తెలిసింది. మిగతా నలుగురు ఎవరనేది తెలియదు. బాక్స్‌‌లో ఉన్న దుప్పటి సగం వరకు కత్తిరించి ఉంది. కాటన్ ఫ్లానెల్‌‌తో నేశారు. దానిపై ఆకుపచ్చ, తెలుపు, గోధుమ, ఎరుపు రంగులతో డిజైన్‌‌ ఉంది. దానికి ఆటోమోటివ్ గ్రీజు అంటుకుని ఉంది. అయితే.. ఇలాంటి దుప్పట్లు వేలల్లో మార్కెట్‌‌లో ఉన్నాయి. కాబట్టి ఆ దుప్పటి ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కుదర్లేదు. 

చంపేశారా? 
అతన్ని చంపేశారా? లేక అనారోగ్యంతో చనిపోతే ఇక్కడ పడేశారా? అనేది తెలుసుకోవడం పోలీసులకు సవాల్‌‌గా మారింది. అబ్బాయి కుడి అరచేతి మీద, అరికాళ్ల మీద గుండ్రని మడతలు ఉన్నాయి. చనిపోయేటప్పుడు అతను నీళ్లలో ఉంటే అలాంటి మచ్చలు ఏర్పడతాయని డాక్టర్లు తేల్చారు. పైగా అతని అన్నవాహికలో ముదురు గోధుమ రంగు ఫుడ్‌‌ ఉంది. అంటే అతను చనిపోయే ముందు వాంతి చేసుకున్నాడు. ఈ ఆధారాల వల్ల అతను యాక్సిడెంటల్‌‌గా చనిపోయాడా? లేక చంపేశారా? అనేది తెలియలేదు. పైగా ఒంటిమీద గాయాల గుర్తులు ఉన్నాయి. అంటే చాలా రోజుల నుంచి అబ్బాయిని చిత్ర హింసలు పెట్టడం వల్ల చనిపోయి ఉండొచ్చని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్పారు. 

అనాథా? 
అబ్బాయి అనాథ అయ్యుంటాడనే కోణంలో కూడా ఎంక్వైరీ చేశారు. పోలీసు టెలీటైప్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని సిటీలకు అబ్బాయి ఫొటోలను పంపారు. అతన్ని గుర్తించేందుకు 10 రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. కానీ.. ఎవరూ గుర్తించలేకపోయారు. పోలీసులు దాదాపు అన్ని అనాథాశ్రమాల్లో ఎంక్వైరీ చేశారు. అయినా.. అతని వివరాలు దొరకలేదు. చివరకు పెన్సిల్వేనియాలోని హోమ్స్‌‌బర్గ్‌‌లోని మెకానిక్స్‌‌ విల్లేలో ఖననం చేశారు. 

ఆడపిల్లలా పెంచారా? 
చనిపోయిన తర్వాత అబ్బాయి వెంట్రుకలు కత్తిరించడం చూస్తుంటే అంతకుముందు అతని వెంట్రుకలు పెద్దగా ఉండి ఉండొచ్చు. పైగా అతని ఐబ్రోస్‌‌ షేప్‌‌ చేసి ఉన్నాయి. అంటే బతికిఉన్నప్పుడు ఇతన్ని ఆడపిల్లలా పెంచారేమో అనే అనుమానంతో ఆడపిల్లలా స్కెచ్‌‌ గీయించి పేపర్‌‌‌‌లో ప్రింట్‌‌ చేయించారు పోలీసులు. అయినా రెస్పాన్స్‌‌ రాలేదు. 

వెయ్యి డాలర్ల గిఫ్ట్‌‌
రెమింగ్టన్ బ్రిస్టో అనే మెడికల్ ఎగ్జామినర్ ఈ కేసును పర్సనల్‌‌గా తీసుకున్నాడు. అబ్బాయి యాక్సిడెంటల్‌‌గా చనిపోయాడని, అంత్యక్రియలు చేసే స్థోమత లేక అతని తల్లిదండ్రులే ఇలా వదిలేసి ఉంటారని ఊహించాడు. దాంతో ఆ పిల్లాడిని ఎవరైనా గుర్తుపడితే వెయ్యి డాలర్లు రివార్డ్‌‌గా ఇస్తానని ప్రకటించాడు. అయినా లాభంలేకపోయింది. శవం దొరికిన ప్లేస్‌‌కి ఒకటిన్నర మైలు దూరంలో ‘ఫోస్టర్ హోమ్’ అనే అనాథాశ్రమం ఉంది. ఒక సైకియాట్రిస్ట్‌‌ సాయంతో ఆ అనాథాశ్రమంలో ఉన్నవాళ్లను ఇన్వెస్టిగేట్‌‌ చేశాడు బ్రిస్టో. అక్కడ అబ్బాయి దొరికిన పెట్టె కంపెనీకి చెందిన ఉయ్యాల, పెట్టెలో దొరికిన కంపెనీకి చెందిన దుప్పటి ఉన్నాయి. దాంతో ఆ అబ్బాయి ఈ అనాథాశ్రమానికి చెందినవాడే అని కన్ఫర్మ్‌‌ చేశాడు. పైగా దాన్ని నడిపించే అమ్మాయికి పుట్టిన అక్రమ సంతానమని... అబ్బాయి యాక్సిడెంటల్‌‌గా చనిపోవడంతో శవాన్ని పారేశారని చెప్పాడు. కానీ.. ఈ వాదనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పైగా ఆ అనాథాశ్రమంలోని పిల్లల్లో ఒక్కరు కూడా ఈ అబ్బాయి ఫొటోను గుర్తుపట్టలేదు. 

మార్తా(ఎమ్) కథ
ఎన్నేళ్లు గడిచినా పోలీసులు కేసును మూసేయలేదు. దాదాపు యాభై ఏళ్లకు ఫిబ్రవరి 2002లో ఒక మహిళ అబ్బాయి గురించి తనకు తెలుసని పోలీసులకు చెప్పింది. ఆమె పేరు మార్తా. కానీ.. బయటికి తెలియకుండా ‘‘ఎం”అని పిలవాలని కోరింది. ఆమె చెప్పిన కథనం ప్రకారం..  చనిపోయిన అబ్బాయి పేరు జోనాథన్. వాళ్ల తల్లి ఆ అబ్బాయిని ఒక పేద భార్యాభర్తల నుంచి కొనుక్కుంది. తర్వాత రెండున్నర ఏళ్లపాటు అతన్ని హింసించింది. ఒక రోజు రాత్రి అతను బీన్స్​తో చేసిన వంటకం తిని వాంతి చేసుకున్నాడు. దాంతో అతనిపై కోపంతో పెంచిన తల్లి బలంగా కొట్టింది. పిల్లగాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత శవానికి స్నానం చేయించి, ఎవరూ గుర్తుపట్టకుండా జుట్టు కట్ చేసి పెట్టెలో పెట్టి పారేశారు. అందుకు ‘ఎం’ కూడా సాయం చేసింది. పోలీసులు ఆమె చెప్పిన కథనాన్ని నమ్మి ఎంక్వైరీ చేశారు. ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్లను  పిల్లాడి గురించి అడిగి తెలుసుకున్నారు. కానీ.. ఆ అబ్బాయి ఆ ఇంట్లో ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. మార్తా ఒక మానసిక రోగి. ఆమె చెప్పిందంతా కట్టుకథ. దాంతో పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్‌‌ ఇచ్చి పంపించేశారు. 

డీఎన్‌‌ఏ టెస్ట్‌‌
1998లో ఆ అబ్బాయి పళ్ల ఎనామిల్ ద్వారా డీఎన్‌‌ఏ టెస్ట్‌‌ చేయాలని శవాన్ని బయటికి తీశారు.  యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌‌లో టెస్ట్‌‌లు చేశారు. ఆ రిపోర్ట్‌‌లను నేషనల్‌‌, స్టేట్‌‌ డేటాబేస్‌‌తో పోల్చి చెక్‌‌ చేశారు. కానీ.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దాంతో తిరిగి ఫిలడెల్ఫియాలోని ఐవీ హిల్ శ్మశానవాటికలో పూడ్చేశారు. సమాధిపై ‘‘అమెరికాస్ నోన్ చైల్డ్” అని రాసి ఉన్న శిలాఫలకాన్ని పెట్టారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ శవం దొరికిన రోజు ఆ సమాధిని అందంగా ముస్తాబు చేసి, నివాళులు అర్పిస్తున్నారు స్థానికులు.  

టోపీ
పెట్టెలో ఒక టోపీ కూడా దొరికింది. దాని మీద ‘‘రాబిన్స్ బాల్డ్ ఈగిల్ క్యాప్” అని రాసి ఉంది. దాన్ని అమ్మిన షాపు పేరు ఉంది. ఆ షాపు ఓనర్‌‌‌‌ హన్నా రాబిన్స్‌‌ను పోలీసులు ఎంక్వైరీ చేశారు. కస్టమర్‌‌‌‌ ఆ టోపీని  కస్టమైజ్‌‌ చేయించుకోవడం వల్ల ఆమెకు కొన్ని వివరాలు గుర్తున్నాయి. అతనికి 26 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుందని... రాగి రంగు జుట్టు ఉంటుందని చెప్పిందామె. కానీ.. ఆమె చెప్పిన ఆనవాళ్లతో ఎవరినని అనుమానిస్తారు? 


::: సగన్​