చైనా వస్తువులను కొనద్దు : కేంద్రానికి కేజ్రీవాల్‌ డిమాండ్‌

చైనా వస్తువులను కొనద్దు : కేంద్రానికి కేజ్రీవాల్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌‌లో ఇటీవల ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ప్రధాని మోడీ ప్రభుత్వంపై ఆప్‌ చీఫ్ అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఫైర్‌‌ అయ్యారు. మన సోల్జర్స్‌ తమ ప్రాణాలు పణంగా పెట్టి, చైనా సైనికులతో పోరాడుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఆ దేశ దిగుమతులపై బ్యాన్‌ విధించడకుండా, అధిక మొత్తంలో దిగుమతుల చేసుకుంటూ బీజింగ్‌కు బహుమతి ఇస్తోందన్నారు. చైనా వస్తువులను బ్యాన్‌ చేసి, మన సైనికులకు ధైర్యం, గౌరవం ఇవ్వాలని కోరారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో జరిగిన నేషనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో చైనా తన దూకుడును పెంచుతోందని, ఇక్కడ మోడీ ప్రభుత్వం మాత్రం అంతా బాగానే ఉందని చెబుతోందని మండిపడ్డారు. ‘‘కొన్నేండ్లుగా చైనా నుంచి మన దేశంలోకి చొరబాట్లు ఎక్కువయ్యాయి. మన సొల్జర్స్‌ ఆ దేశ సైనికులతో పోరాడి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రధాన మోడీ మాత్రం ఆ దేశం నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని, వారికి గిఫ్ట్‌ కింద ఇస్తున్నారు. 2020–2021లో చైనా నుంచి 65 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులను దిగుమతి చేసుకున్నారు. వచ్చే ఏడాది దిగుమతి వస్తువులను 95 బిలియన్‌ డాలర్లకు పెంచడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించింది”అని పేర్కొన్నారు. 

మన సోల్జర్స్‌ అంటే రెస్పెక్ట్ లేదా? 

‘‘మన సోల్జర్స్‌ అంటే మీకు రెస్పెక్ట్ లేదా? వారి ప్రాణాలకు విలువ లేదా? చైనా నుంచి ఇండియా దిగుమతులు ఆపితే, అప్పుడు మన దేశ విలువ వారికి తెలుస్తుంది”అని కేజ్రీవాల్‌ అన్నారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని దేశ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. చైనీస్‌ వస్తువులు చౌకగా ఉన్నాయని అంటున్నారని, అవి తక్కువ రేటుకు దొరికినా తమకొద్దన్నారు. రెట్టింపు ఖర్చయినా మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే 90 శాతం వస్తువులను ఇండియాలోనే తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత ఐదారేండ్లలో 12.5 లక్షల మంది మన దేశం వదిలి వెళ్లిపోయారని చెప్పారు. బీజేపీ వాళ్లు దొంగలను పట్టుకోరని, అలాంటి వారిని పార్టీలో చేర్చుకొని రక్షణ కల్పిస్తారని ఆరోపించారు. కానీ, నిజాయితీగా పనిచేయాలనుకునే వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తారన్నారు. దీంతో రిచ్‌ పిపుల్స్‌, బిజినెస్‌ మెన్‌లపై దాడులు చేయించి, దేశం విడిచిపెట్టి పారిపోయేలా చేస్తున్నారని పేర్కొన్నారు.