
మాదాపూర్, వెలుగు: ఓ యువకుడు ప్రియురాలిని గొంతు కోసి చంపి, తను సూసైడ్ చేసుకున్న ఘటన మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం హకీంపేటకు చెందిన రాములు(25), లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి(25), ప్రేమికులు. వీరు బుధవారం మధ్యాహ్నం మాదాపూర్ లోని లెమన్ ట్రీ హోటల్ లో రూమ్ తీసుకున్నారు. రాములు బ్లేడ్ తో సంతోషి గొంతు కోసి చంపి డెడ్ బాడీని బాత్రూంలో పడేశాడు. ఆ తర్వాత అతను ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. గురువారం సాయంత్రం రూమ్ బాయ్ తలుపు కొట్టగా ఎవరూ తీయలేదు. అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా రాములు, సంతోషి డెడ్‌బాడీలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వచ్చి మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. రాములు ప్లాన్ ప్రకారమే సంతోషిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తూ కేసు ఫైల్ చేశారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రాములు, సంతోషి నెలరోజుల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం.