చంపేందుకు కుట్ర? : శరీరంలో సూదులు

చంపేందుకు కుట్ర? : శరీరంలో సూదులు

బాడీలో ఇంకో మూడున్నాయని వెల్లడి
ఇద్దరు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు

వనపర్తి, వెలుగు: వనపర్తి బాలుడి ఆపరేషన్‌‌ విజయవంతమైంది. ఆ పిల్లాడి శరీరం నుంచి 8 సిరంజి సూదులను డాక్టర్లు బయటకు తీశారు. ఇంకో మూడు సూదులున్నాయని, వాటిని జాగ్రత్తగా తీయాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన దంపతులు పెబ్బేటి అశోక్‌‌, అన్నపూర్ణల కొడుకు లోక్‌‌నాథ్‌‌ (మూడేళ్లు) నాలుగైదు రోజులుగా తొడ, పిరుదుల్లో నొప్పిగా ఉందని ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు తడిమి చూశారు. పిరుదులో ఓ గుండుసూది గుచ్చుకున్నట్టు గుర్తించి బయటకు తీశారు. సెప్టిక్‌‌ అవుతుందేమోనని వనపర్తిలోని సుధా నర్సింగ్‌‌హోంకు తీసుకెళ్లారు. అక్కడ  డాక్టర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి ఎక్స్‌‌రే తీయగా బాలుడి తొడలో  మొత్తం 11 సిరంజి సూదులు ఉన్నట్లు గుర్తించారు.

వాటిని తీయించేందుకు బాలుడిని తల్లిదండ్రులు హైదరాబాద్‌‌కు తీసుకొచ్చారు. కొన్ని ఆస్పత్రుల్లో చూపించగా సూదుల్ని తీసేందుకు డాక్టర్లు భయపడ్డారు. మరికొందరు రూ. లక్షల్లో అవుతుందని చెప్పగా మళ్లీ వనపర్తికే తీసుకొచ్చారు. వాళ్ల ఆర్థిక పరిస్థితిని గమనించిన డాక్టర్‌‌ శ్రీనివాస్‌‌..  మంగళవారం ఆపరేషన్‌‌ మొదలుపెట్టారు. 5 గంటల పాటు శ్రమించి 8 సూదులను బయటికి తీశారు. బాలుడికి తొడలు, పిరుదులు, మల ద్వారంలో సూదులున్నాయని, మల ద్వారంలోని మూడు సూదుల్ని తప్ప అన్నింటినీ తీసేశామని డాక్టర్ చెప్పారు. ఆ మూడింటిని మరింత జాగ్రత్తగా తీయాల్సి ఉందన్నారు.

దగ్గరోళ్ల పనే?

బాలుడిని దగ్గరి వాళ్లే చంపేందుకు కుట్ర పన్నారని పోలీసులు అనుమానిస్తునారు. దీనిపై విచారణ జరుపుతున్నామని వనపర్తి డీఎస్పీ కిరణ్​కుమార్ చెప్పారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంజక్షన్ చివరిని తొలగించి సూదిని లోపికి గుచ్చి ఉంటారని పోలీసులు అంటున్నారు.

see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ