
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం పోర్టు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని బీపీసీఎల్ భావిస్తోంది. పెరుగుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం కంపెనీ పరిశీలిస్తోంది. బీపీసీఎల్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ ఖన్నా సోమవారం కంపెనీ వాటాదారుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి, వినియోగ దేశం ఇండియా అని, 2030 నాటికి రోజుకు 10 లక్షల బ్యారెల్స్ అదనపు చమురు డిమాండ్‌తో భారత్ మొదటిస్థానంలో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్ రోజుకు 55 లక్షల బ్యారెల్స్ చమురును వినియోగిస్తోంది. 90 లక్షల టన్నుల సామర్థ్యంతో రానున్న ఈ యూనిట్‌కు రూ.95వేల కోట్లు ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ముంబై రిఫైనరీని రూ.14,200 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నట్లు ఖన్నా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని బినా, కేరళలోని కొచ్చిలో మరో రెండు ప్రధాన పెట్రోకెమికల్ ప్రాజెక్టులు రూ.54వేల కోట్ల పెట్టుబడితో పురోగతిలో ఉన్నాయని చెప్పారు.