మినీ ఇండియాలో నేషనల్‌‌ బ్యాంకులేవి?

మినీ ఇండియాలో నేషనల్‌‌ బ్యాంకులేవి?

13 గ్రామాలు..15 వేల ఖాతాదారులు..

అందరికీ  గ్రామీణ బ్యాంకే దిక్కు 

ఎస్‌‌బీఐ ఏర్పాటుకు సర్వే చేసినా.. ఏటీఎం సేవలకే పరిమితం 

మండల విభజనతో బ్యాంకు సేవలపై సమస్యలు

సంగారెడ్డి/జిన్నారం, వెలుగు : మినీ ఇండియా పేరొందిన సంగారెడ్డి జిల్లా పటాన్‌‌ చెరు పరిధిలోని జిన్నారం ఇండస్ట్రియల్ ఏరియాలో నేషనల్ బ్యాంకుల బ్రాంచీలు కరువయ్యాయి. స్థానిక ప్రజలతో పాటు వందల్లో పరిశ్రమలు, వేలల్లో వ్యాపారులు, లక్షల్లో కార్మికులు ఉండే ఈ ఏరియాలో ప్రతిరోజూ కోట్లల్లో బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి.  కానీ, ఒక్కటంటే ఒక్క నేషనల్ బ్యాంకు కూడా లేదు. అందరికీ ఏపీజీవీ బ్యాంకు మాత్రమే దిక్కవడంతో..  ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  చేసేదిలేక కొందరు హైదరాబాద్‌‌కు దగ్గరలో ఉన్న మేడ్చల్‌‌లోని బ్యాంకులను వెళ్తున్నారు.  కొన్ని ఫ్యాక్టరీల యాజమాన్యాలు సైతం మేడ్చల్, గండిమైసమ్మ, షాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతున్నట్లు తెలిసింది. 

ఏపీజీవీబీపై ఒత్తిడి

బొల్లారం పారిశ్రామిక వాడలో ఒక ఎస్‌‌బీఐ బ్రాంచ్ ఉన్నా... అది మున్సిపాలిటీకి మాత్రమే పరిమితం అవుతోంది.  గడ్డపోతారం, ఖాజీపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోఉంటున్న వారికి ఈ సేవలు అందుబాటులోకి రావడం లేదు. దీంతో జిన్నారంలో ఉన్న ఏపీజీవీబీ బ్యాంకే అందరికీ దిక్కవుతోంది.  కానీ, 13 గ్రామాలకు సంబంధించిన 15 వేలకు పైగానే ఖాతాలు ఇందులోనే ఉండడంతో నిర్వహణ భారం అవుతోంది.  సాధారణ ఖాతాలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, మహిళా సంఘాలు,  వ్యాపారుల ఖాతాలు ఇక్కడే ఉన్నాయి.  దీంతో ఖాతాదారులు తమ సొంత డబ్బులు తీసుకోవాలన్న గంటల తరబడి వెయిట్‌‌ చేయాల్సి వస్తోంది.  చెక్కులు క్లియరెన్స్ చేయాలంటే మూడు రోజులు టైం పడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  అంతేకాదు కొన్ని డీడీలు ఏపీజీవీబీలో చెల్లడం లేదు. వాళ్లు నేషనల్‌‌ బ్యాంకులకు వెళ్లాలని చెబుతుండడంతో సమస్య రెట్టింపు అవుతోంది. అంతేకాదు రుణాలపై వడ్డీల విషయంలోనూ వ్యత్యాసాలు ఉన్నాయని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.

మండల ఏర్పాటుతోనే...

గుమ్మడిదల మండలంలో విలీనమై ఉండే జిన్నారం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా మార్చారు. ఇదివరకు ఇక్కడ ఉన్న ఎస్‌‌బీఐ బ్రాంచ్‌‌ని గతంలో నగరానికి చేరువలో మరో చోటుకు తరలించారు. కొత్త మండలంగా ఏర్పడిన జిన్నారం ఇండస్ట్రియల్ ఏరియాలో నేషనల్ బ్యాంకు అవసరాన్ని గుర్తించిన స్థానికులు అప్పట్లో హైదరాబాద్‌‌లోని ప్రధాన శాఖ అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో వాళ్లు రెండేళ్ల కింద ఏరియాలో సర్వే చేశారు. కానీ ఇప్పటివరకు బ్రాంచి ఏర్పాటు చేయలేదు.  ఒక ఏటీఎంను మాత్రం ఏర్పాటు చేశారు. కానీ, అందులో ఇలా డబ్బులు పెట్టగానే అలా ఖాళీ అయిపోతున్నాయని ఖాతాదారులు చెబుతున్నారు.   

ఇబ్బందులు పడుతున్నం

ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్న జిన్నారం మండలంలో నేషనల్ బ్యాంకు బ్రాంచీలు లేక ఇబ్బందులు పడుతున్నం.  ఏపీజీవీబీలో ఖాతాలు ఎక్కువై బ్యాంకు అధికారులు ఒత్తిడితో పని చేస్తున్నారు. అందుకే చిన్న పనికి కూడా గుమ్మడిదల, మేడ్చల్‌‌లోని బ్యాంకులకు పోవాల్సి వస్తోంది జిన్నారం పారిశ్రామిక వాడలో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేయాలి.

- నరేందర్, జిన్నారం

 ఎస్‌‌బీఐ బ్రాంచీ పెట్టాలి
జిన్నారంలో ఎస్‌‌బీఐ బ్రాంచీ ఏర్పాటు చేయాలి. బ్యాంక్‌‌ అధికారులు రెండేళ్ల కింద సర్వే చేసినా ఇప్పటి వరకు బ్రాంచీ పెట్టలేదు.  దీంతో ఇండస్ట్రియల్ ఏరియాలోని కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకు ఏర్పాటుపై  జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంటనే స్పందించాలి. 

- శ్రీకాంత్, మంగంపేట్