ఫిఫా వరల్డ్ కప్లో వేట మొదలు పెట్టిన బ్రెజిల్

ఫిఫా వరల్డ్ కప్లో వేట మొదలు పెట్టిన బ్రెజిల్

ఫిఫా వరల్డ్‌కప్‌ 2022లో బ్రెజిల్ యుద్ధం మొదలు పెట్టింది. సెర్బియాతో జరిగిన ఫస్ట్ మ్యాచులో 2-0 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ సంచలనం రిచర్లిసన్ రెండు గోల్స్ చేసి...జట్టుకు విజయాన్ని అందించాడు. బ్రెజిల్ దూకుడు, దుర్భేధ్యమైన డిఫెన్స్ ముందు సెర్బియా నిలబడలేకపోయింది. కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేక చతికిలపడింది. ఈ విజయంతో గ్రూప్‌ Gలో బ్రెజిల్‌ 3 పాయింట్లతో టాప్‌కు దూసుకెళ్లింది. 

ఒక్కడే రెండు గోల్స్..

ఫిఫా వరల్డ్ కప్లో బ్రెజిల్ బోణి కొట్టింది.  తొలి మ్యాచ్‌లో సెర్బియాను చిత్తు చేసింది.  లూసెయిల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సెర్బియాను 2-0 తేడాతో బ్రెజిల్‌ ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఫస్టాఫ్లో  ఇరు జట్లు ఒక్క  గోల్ కూడా చేయలేకపోయాయి.   ఇక సెకండాఫ్లో బ్రెజిల్ రెండు గోల్ సాధించింది. 63వ నిమిషంలో రిచర్లిసన్  తొలి గోల్ సాధించి..బ్రెజిల్ఆధిక్యాన్ని 1 -0కు పెంచాడు. మరో 10 నిమిషాల్లో రిచర్లిసన్‌ మరో గోల్ కొట్టాడు. దీంతో బ్రెజిల్ ఆధిక్యం 2-0కు పెరగింది. ఆ తర్వాత సెర్బియా బ్రెజిల్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 


  

వాటే గోల్ ...

73వ నిమిషంలో రిచర్లిసన్ చేసిన గోల్కు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. గాల్లోకి ఎగిరి.. సీజ‌ర్ కిక్ షాట్‌తో చేసిన గోల్.. అంద‌ర్నీ ఆకట్టుకుంది.  ఫార్వార్డ్ ప్లేయ‌ర్ వినిసియ‌స్ ఇచ్చిన క్రాస్ పాస్‌ను మొదట్లో కంట్రోల్ చేయ‌లేక‌పోయిన రిచర్లిసన్.. ఆ త‌ర్వాత గాల్లోకి ఎగిరి రివ‌ర్స్ కిక్‌తో గోల్ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఇక బ్రెజిల్ త‌ర‌పున ఆడిన గ‌త ఏడు మ్యాచుల్లో రిచ‌ర్లిస‌న్ మొత్తం 9 గోల్స్ చేయడం విశేషం.